Pune Porsche Crash:పూనేలో 17 ఏళ్ల మైనర్ మద్యం మత్తులో లగ్జరీ కారు నడుపుతూ ఇద్దరి మృతి కారణమైన విషయం తెలిసిందే. కాగా ఈ మైనర్ పూనేలో ప్రముఖ బిల్డర్ కుమారుడు 12వ తరగతి పరీక్షల్లో పాస్ అయిన సందర్బంగా స్నేహితులతో కలిసి పార్టీ చేసుకున్నాడు. పార్టీ ముగిసిన తర్వాత తన లగ్జరీ కారును 200 కిలోమీటర్ల వేగంతో డ్రైవ్ చేస్తూ ఇద్దరు స్టాప్‌వేర్ ఉద్యగుల మృతికి కారకుడయ్యాడు. అప్పటి నుంచి ఈ కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఈ ప్రమాదం తర్వాత దేశవ్యాప్తంగా దీనిపై తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. మైనర్‌తోపాటు వారి తల్లిదండ్రులను శిక్షించాలని పలు నగరాల్లో నిరసన ర్యాలీలు కూడా నిర్వహించారు.
డ్రైవర్ కు బెదిరింపులు..(Pune Porsche Crash)
అయితే పూనే పోలీసు కమిషనర్ శనివారం నాడు మీడియాలో సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని విషయాలు బయటపెట్టాడు. నేరాన్ని తమ డ్రైవర్‌పై నెట్టడానికి అన్నీ రకాల ప్రలోభాలకు గురి చేశారు. ప్రమాదం జరిగినప్పుడు తానే డ్రైవ్ చేశానని పోలీసుల ముందు ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని.. డబ్బు ఇస్తామని ఆశ జూపారు…. దీనికి డ్రైవర్ అంగీకరించకపోవడంతో బెదిరింపులకు దిగారు. కాగా డ్రైవర్‌ను రెండు రోజుల పాటు గదిలో బంధించి నేరం తాను చేశానని ఒప్పుకోవాలని ఒత్తిడి చేశారని పోలీసు కమిషనర్ అమితేష్ కుమార్ మీడియా సమావేశంలో చెప్పారు.
తాజాగా మైనర్ తాత తనను రెండు రోజుల పాటు గదిలో బంధించాడని… ఇంటికి కూడా వెళ్లనీయలేదని డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కిడ్నాప్ కేసు రిజిష్టర్ చేసి మైనర్ తాతాను అరెస్టు చేశారు. మైనర్ బాలుడి తాత, తండ్రి డ్రైవర్ మొబైల్ ఫోన్ లాక్కొని తమ వద్ద ఉంచుకున్నారు. ఈ నెల 19, 20 తేదీల్లో డ్రైవర్‌ను తమ బంగ్లాలో నిర్బంధించారు. తర్వాత డ్రైవర్ భార్య తన భర్తను విడిపించుకుపోయారని పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా సాక్ష్యాలు సేకరించామని పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు మైనర్ మద్యం మత్తులో ఉన్నాడు. 12వ తరగతి పరీక్ష పాస్ అయిన తర్వాత స్నేహితులతో కలిసి ఖరీదైన పబ్‌లో పార్టీ చేసుకున్నారు. సుమారు రూ.48,000 బిల్లు చెల్లించాడు. పబ్ నుంచి బయటకి వచ్చిన తర్వాత డ్రైవర్‌తో గొడవపడి కారు తాళాలు తీసుకున్నాడు. కాగా డ్రైవర్ కారు తాళాలు ఇవ్వడానికి నిరాకరించినా.. మైనర్ తండ్రి ఫోన్ చేసి కారు తాళాలు ఇవ్వమంటే డ్రైవర్ ఇచ్చాడు. మద్యం మత్తులో 200 కిలోమీటర్ల వేగంతో ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను ఢీకొట్టడంతో అక్కడికక్కడే చనిపోయారు. పోలీసులు తెల్లవారు జామున 3 గంటలకు మైనర్‌ను అరెస్టు చేశారు. అయితే 15 గంటల్లోనే షరతులతో కూడిన బెయిల్ దక్కించుకున్నాడు. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అయ్యాయి. అయితే పూనే పోలీసులు మాత్రం చట్టం ప్రకారం మైనర్‌ను శిక్షిస్తామని చెప్పారు.