Priyanka Gandhi: ప్రియాంక గాంధీ వాద్రా అనే నేను.. చేతిలో రాజ్యాంగ ప్రతి పట్టుకుని మరి..!

Priyanka Gandhi Takes Oath In Parliament: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉపఎన్నికల్లో ప్రియాంక గాంధీ భారీ మెజార్టీతో గెలుపొందింది. ఈ మేరకు ఆమె గురువారం లోక్‌సభలో ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసింది. కాగా, నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక గాంధీతోపాటు ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కొత్త సభ్యులతో స్పీకర్ ఓం బిర్లా ప్రమాణం చేయించారు. ఈ సమయంలో ఆమె చేతిలో రాజ్యాంగ ప్రతి పట్టుకున్నారు. ఈ మేరకు ఎంపీగా ప్రమాణం చేసిన ప్రియాంక గాంధీకి పలువురు ఎంపీలు అభినందనలు తెలిపారు.

లోక్‌సభలో ప్రమాణ స్వీకారం చేయకుముందు పార్లమెంట్ ఆవరణలో అట్రాక్షన్‌గా నిలిచారు. కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా చీరకట్టులో రావడంతో ఆకర్షణగా నిలిచారు. కేరళలో ప్రసిద్ధి చెందిన కసవుగా పిలిచే చేనేత చీరను ఆమె ధరించి కనిపించారు. ఈ సమయంలో ఆమె సోదరుడు రాహుల్ గాంధీతో కలిసి పార్లమెంట్ ఆవరణలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే కాంగ్రెస్ ఎంపీలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఈ సమయంలో ఆక్కడ దృశ్యాలు ఆసక్తికరంగా సాగాయి. కాగా, ప్రియాంకను రాహుల్ గాంధీ తన ఫోన్‌తో ఫొటోలు తీశాడు. దీంతో సహచర ఎంపీలు నవ్వుతూ ఫోజులు ఇచ్చారు. అనంతరం పార్లమెంట్‌లోకి వెళ్లారు.

ఇదిలా ఉండగా, అంతకుముందు వయనాడ్ లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వయనాడ్‌ను వదులుకున్న రాహుల్ గాంధీ.. ప్రస్తుతం రాయ్‌బరేలీ నుంచి లోక్‌సభ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. అయితే, నవంబర్ 20వ తేదీన జరిగిన పార్లమెంట్ ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో ఆమె తన సమీప ప్రత్యర్థిపై 4,10,931 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఆమె పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే విజయం సాధించి రికార్డు నెలకొల్పింది.