PM Modi : విశ్వావసు నామ సంవత్సర ఉగాది సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మన్‌కీ బాత్ 120వ కార్యక్రమంలో ప్రధాని ఉగాది పండుగ ప్రాముఖ్యత గురించి వివరించారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి తనకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశాయని తెలిపారు. భారత్‌లోని ఆయా పండుగల గురించి ప్రధాని ప్రసంగించారు.
ఆయా భాషల్లో మోదీకి శుభాకాంక్షలు..
ఇండియాలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి ఆయా భాషల్లో తనకు శుభాకాంక్షలు అందాయని ప్రధాని చెప్పారు. బిహార్, బెంగాల్, తమిళనాడు, గుజరాత్ తదితరల ప్రాంతాల నుంచి లేఖలు వచ్చాయని పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండుగు, మహారాష్ట్రలో గుడి పద్వా పేరుతో నూతన సంవత్సరానికి ప్రజలు ఆహ్వానం పలుకుతున్నారని తెలిపారు. మరి కొన్ని రోజుల్లో అస్సాంలో రొంగాలి బిహు, బెంగాల్‌లో పొయిలా బోయిషాఖ్, కాశ్వీర్‌లో నవ్రేహ్ వేడుకలు చేసుకుంటారని వివరించారు. భారత దేశం భిన్నత్వంతో కూడుకుందని పేర్కొన్నారు.
పండుగలను రకరకాలుగా జరుపుకుంటారు..
దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో పండుగలను రకరకాలుగా నిర్వహిస్తారని వెల్లడించారు. అయినప్పటికీ ఇండియా భిన్నత్వంలో ఏకత్వంగా ఉంటుందన్నారు. మన ఐక్యతను ఇలాంటి ప్రత్యేక సందర్భాలు చూపిస్తాయని కొనియాడారు. మనమంతా కలిసికట్టుగా ముందుకెళ్లే మార్గంలో ఐక్యతా స్ఫూర్తిని బలోపేతం చేస్తూనే ఉండాలని ఆకాంక్షించారు. ఇటీవల మారిషస్ పర్యటనను ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో భారతీయ సంస్కృతి ప్రతిబింబిస్తోందన్నారు.
గీత్ గవాయ్ ప్రదర్శన ఆకట్టుకుంది..
మారిషస్‌లోని గీత్ గవాయ్ ప్రదర్శన తనను ఆకట్టుకుందని చెప్పారు. అక్కడి జరిగే ప్రదర్శనలు చూస్తే మన దేశ మూలాలు ఇంకా ఉన్నాయని గుర్తుచేశారు. ఎలాంటి తుఫాను వచ్చినా మనల్ని నాశనం చేయలేదన్నారు. సుమారు 200 ఏళ్ల క్రితం ఇండియా నుంచి ఎంతో మంది కార్మికులుగా మారిషస్ వెళ్లారని, కాలక్రమేణ చాలా మంది అక్కడే స్థిరపడ్డారని చెప్పారు. వారికంటూ ప్రత్యేక గుర్తింపు సాధించారని స్పష్టం చేశారు. ఇండియా మూలాలను కాపాడుతున్నారని, గయానాలో కూడా చౌతల్ ప్రదర్శన అద్భుతంగా అనిపించిందన్నారు. ఫిజి, సురినామ్‌లో కూడా భారతీయ సంస్కృతి కనిపిస్తోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఏడాది యోగా దినోత్సవం ‘వన్ ఎర్త్ వన్ హెల్త్’ థీమ్‌ను ఆయన వెల్లడించారు.