PM Modi meets Bangladesh Interim Chief Adviser Muhammad Yunus : బంగ్లా తాత్కాలిక ప్రధాన సలహాదారు మహమ్మద్ యూనస్‌తో ప్రధాని మోదీ భేటీ అయ్యారు. థాయిల్యాండ్‌లోని బ్యాంగ్‌కాక్‌లో జరుగుతున్న బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సమావేశాల్లో ప్రధాని పాల్గొన్నారు. గత ఆగస్టులో బంగ్లా సర్కారులో యూనస్ కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధానితో జరిగిన తొలి సమావేశం ఇదే. ఓవైపు బీజింగ్-ఢాకాల మధ్య మిత్రత్వం పెరుగుతున్న క్రమంలో వీరిద్దరి మధ్య చర్చలు జరగడం గమనార్హం. వాస్తవానికి ప్రధాని మోదీతో భేటీ కోసం యూనస్ తరఫున బంగ్గా విదేశాంగ శాఖ ఇండియాను అభ్యర్థించింది. తాము భారత ప్రధానితో సమావేశం కోసం ఎదురుచూస్తున్నామని, సానుకూల నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
ఈశాన్య రాష్ట్రాలపై యూనస్ వివాదాస్పద వ్యాఖ్యలు..
షేక్ హసీనా బంగ్లాను వీడిన నాటి నుంచి ఇండియా-బంగ్లాదేశ్ సంబంధాల్లో కొంత ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు బంగ్లాలోని మైనార్టీల రక్షణపై న్యూఢిల్లీ కూడా పలుమార్లు ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి తోడు ఇటీవల మహమ్మద్ యూనస్ భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మరింత ఆజ్యం పోసింది. ఈ వ్యాఖ్యలను మన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కూడా ఖండించారు. ఈశాన్య రాష్ట్రాలకు రోడ్లు, రైళ్లు, జలమార్గాలు, గ్రిడ్‌లు, పైపులైన్లు ఉన్నాయన్నారు. బిమ్‌స్టెక్ దేశాలకు ఇది కీలకమైన కనెక్ట్‌విటీ హబ్‌గా అభివర్ణించారు.
బిమ్స్‌టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు..
బిమ్స్‌టెక్ సభ్య దేశాలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు. ఇండియాలోని యూపీఐ పేమెంట్ విధానాన్ని సభ్య దేశాలతో పంచుకోనున్నట్లు ఆయన చెప్పారు. దీన్ని ద్వారా వాణిజ్యం, వ్యాపారం, టూరిజం మెరుగుపడనున్నట్లు వెల్లడించారు. బిమ్స్‌టెక్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. దీన్ని ద్వారా వార్షిక వ్యాపార సదస్సులు నిర్వహించుకోవచ్చని చెప్పారు. స్థానిక కరెన్సీతో ట్రేడ్ చేసుకోవచ్చని తెలిపారు. మార్చి 28న భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం చవిచూసిన మయన్మార్, థాయిలాండ్‌కు ప్రధాని మోదీ సంతాపం తెలిపారు.