New Delhi: ట్రిపుల్ తలాక్‌పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్లిమ్ మహిళలకు తలాక్ ద్వారా విడాకులు ఇవ్వటాన్ని తప్పుపట్టలేమని తెలిపింది. అయితే ఒకే సారి కాకుండా, నెలకోసారి చొప్పున మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం నేరం కాదని తేల్చింది. అలాగే ముస్లిం మహిళలకు భర్త నుంచి విడిపోవడానికి, ఖులా అనే నిబంధన ఉందని ధర్మాసనం తెలిపింది. ఖులా ద్వారా భర్త నుంచి విడాకులు తీసుకోవచ్చని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ నేతృత్వంలోని బెంచ్ సూచించింది.
ట్రిపుల్ తలాక్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21, 25 లతో పాటు పౌర హక్కులకు విరుద్దం అని పిటీషనర్ వాదించారు. షాయారా బానో కేసులో ట్రిపుల్ తలాక్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు తలాక్ అంశాన్ని ప్రస్తావించలేదని, ముస్లిం మహిళలు త్రిబుల్ తలాక్ వల్ల వివక్షకు గురి అవుతున్నారని అన్నారు. ఇలా ఏక పక్షంగా విడాకులు తీసుకోవడం ఏంటని ధర్మాసనాన్ని పిటీషనర్ ప్రశ్నించారు. వాదోపవాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను ఈ నెల 29 కి వాయిదా వేసింది.