Site icon Prime9

President’s Rule Imposed in Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన.. కుకీలు, మైతీల మధ్య చెలరేగిన హింస!

President’s Rule Imposed in Manipur: మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మణిపూర్‌ సీఎం బీరెన్ సింగ్ ఇటీవల తన పదవీకి రాజీనామా చేసిన విషయం విధితమే. కాగా, 2023 మే నెలలో రాష్ట్రంలోని కుకీలు, మైతీల మధ్య హింస చెలరేగటంతో, అదింకా కొనసాగటంతో గత రెండేళ్లుగా బీరేన్ సింగ్ ప్రభుత్వం విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ ఘర్షణల్లో వందల మంది మృతిచెందగా, వేలాది మంది నిరాశ్రయులైన సంగతి తెలిసిందే.

విపక్షాల ఒత్తిడి..
మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న రాజకీయ పార్టీలు దశలవారీగా తమ మద్దతు ఉపసంహరించుకొన్నాయి. సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ ప్రతిపక్షాలతోపాటు సొంత పార్టీ ఎమ్మెల్యేలు సైతం బీరెన్‌ సింగ్‌పై ఒత్తిడి తీసుకువచ్చారు. ఈ నెల 10న అసెంబ్లీలో సీఎం బీరెన్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం పెడతామంటూ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

ఈ నెల 9న సీఎం పదవికి రాజీనామా..
ఈ నేపథ్యంలో ఈ నెల 9న న్యూఢిల్లీలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో సీఎం బీరెన్ సింగ్ సమావేశమయ్యారు. అదే రోజు సాయంత్రం ఆయన మణిపూర్ చేరుకుని సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం మణిపూర్ ముఖ్యమంత్రిగా ఎవరిని నియమిస్తారోనంటూ చర్చ సాగింది. మరోవైపు మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తారనే ప్రచారమూ సాగింది. కాగా, గురువారం రాష్ట్రపతి పాలనపై కేంద్రం మొగ్గు చూపింది.

గవర్నర్ నిర్ణయం..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 174(1) ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలు చివరిసారిగా సమావేశమైన ఆరు నెలల్లోపు సమావేశమవ్వాలి. మణిపూర్‌లో చివరి అసెంబ్లీ సమావేశం ఆగస్టు 12, 2024న జరిగింది.. దీనితో బుధవారం తదుపరి సమావేశానికి గడువు విధించారు. అయితే, ఆదివారం ముఖ్యమంత్రి ఎన్ బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో, సోమవారం ప్రారంభం కావాల్సిన బడ్జెట్ సమావేశాన్ని గవర్నర్ అజయ్ భల్లా రద్దు చేశారు. సీఎం రాజీనామా తర్వాత.. రాష్ట్రంలో ఏ పార్టీ లేదా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో గవర్నర్ కేంద్రం జోక్యాన్ని కోరాల్సి వచ్చింది.

రెండు జాతుల మధ్య ఘర్షణ..
కుకీ, మెయితీ జాతుల మధ్య రేగిన ఘర్షణ గత రెండేళ్లుగా ఇంకా దారికి రాలేదు. తరచూ ఎక్కడో చోట హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఆందోళన కారులు సీఎం, మంత్రుల ఇండ్ల మీద కూడా దాడులకు దిగటం వార్తల్లో నిలిచింది. కాగా, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి పాలన గరిష్టంగా 6 నెలల పాటు విధించవచ్చు. అయితే, దీనిని పార్లమెంటు ఆమోదంతో 3 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.

Exit mobile version
Skip to toolbar