Praveen Sood: కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ సూద్ వచ్చే రెండేళ్లపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ప్రధానమంత్రి, భారత ప్రధాన న్యాయమూర్తి మరియు లోక్‌సభలో ప్రతిపక్ష నాయకునితో కూడిన ఉన్నత స్థాయి కమిటీ ఆయన పేరును ఖరారు చేసింది.
కర్ణాటక కేడర్‌కు చెందిన 1986-బ్యాచ్ ఐపీఎస్ అధికారి, ప్రవీణ్ సూద్ ప్రస్తుత చీఫ్ సుబోధ్ కుమార్ జైస్వాల్ నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు.సీబీఐ డైరెక్టర్‌ను ప్రధానమంత్రి, సీజేఐ, లోక్‌సభలో ప్రతిపక్ష నేతతో కూడిన కమిటీ రెండేళ్లపాటు నిర్ణీత కాలవ్యవధికి ఎంపిక చేస్తుంది. పదవీ కాలాన్ని ఐదేళ్ల వరకు పొడిగించవచ్చు.సీబీఐ డైరెక్టర్ పదవికి ముగ్గురు సీనియర్ ఐపిఎస్ అధికారులను ఉన్నత స్థాయి కమిటీ షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత సూద్ నియామకం జరిగింది.
1964లో జన్మించిన సూద్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ నుండి పట్టభద్రుడయ్యారు. 1989లో మైసూర్‌లోని అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో తన కెరీర్‌ను ప్రారంభించారు. బళ్లారి మరియు రాయచూర్ పోలీస్ సూపరింటెండెంట్‌గా పనిచేశారు. బెంగళూరు సిటీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, లా అండ్ ఆర్డర్ గా పనిచేసారు. 1999లో, అతను మూడు సంవత్సరాల పాటు మారిషస్ ప్రభుత్వానికి పోలీసు సలహాదారుగా డిప్యుటేషన్‌కు వెళ్లారు. సూద్ గతంలో కర్ణాటక హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా, బెంగళూరు సిటీ పోలీస్ కమిషనర్‌గా మరియు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, సీఐడీ, ఆర్థిక నేరాలు మరియు ప్రత్యేక విభాగాలుగా కూడా పనిచేశారు. 2020లో కర్ణాటక డీజీపీగా నియమితులయ్యారు.
సూద్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డికె శివకుమార్ ఆరోపించారు. శివకుమార్ డీజీపీని ‘నాలక్’ అని పిలిచి, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.