Site icon Prime9

Pratima Bhowmik: త్రిపుర సీఎం గా ప్రతిమా భౌమిక్ ?

Pratima Bhowmik

Pratima Bhowmik

Pratima Bhowmik: తాజాగా జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి మెజారిటీ సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో త్రిపురలోని ధన్‌పూర్ అసెంబ్లీ నియోజక వర్గంనుంచి గెలిచిన కేంద్రమంత్రి ప్రతిమా భౌమిక్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. ఎందుకంటే త్రిపురకు కాబోయే సీఎం అంటూ బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అదే నిజమయితే త్రిపురకు మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా అవుతారు.

రెండుసార్లు మాణిక్ సర్కార్ చేతిలో ఓడిన ప్రతిమా భౌమిక్ ..(Pratima Bhowmik)

సైన్స్‌లో గ్రాడ్యుయేట్ అయిన భౌమిక్ 1991 నుంచి బీజేపీలో ఉన్నారు.పార్టీలో చేరిన ఒక సంవత్సరం తర్వాత, భౌమిక్ బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడిగా మారారు . తరువాత సంవత్సరంలో పార్టీ ధన్‌పూర్ మండల్‌కు చీఫ్‌గా నియమించబడ్డారు.భౌమిక్ పార్టీ యువజన మరియు మహిళా విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. ఆ తర్వాత 2016లో ఆమెను పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారు.1998 మరియు 2018లో ధన్‌పూర్ నుండి త్రిపుర అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసిన ప్రతిమ రెండు సార్లు మాణిక్ సర్కార్‌పై ఓడిపోయారు. అయితే తాజా ఎన్నికల్లో ఆమె అదే స్థానం ధన్‌పూర్ నుండి 3,500 ఓట్ల తేడాతో సీపీఐ(ఎం)కి చెందిన కౌశిక్ చందాను ఓడించి విజయం సాధించారు.

త్రిపుర నుంచి మొదటి కేంద్రమంత్రి..

2019 లోక్‌సభ ఎన్నికలలో, భౌమిక్ 305,689 ఓట్ల భారీ తేడాతో అప్పటి సిట్టింగ్ ఎంపీ శంకర్ ప్రసాద్ దత్తాను ఓడించారు.రెండేళ్ల తరువాత జూలై 2021లో కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. త్రిపుర నుంచి మొట్టమొదటి కేంద్రమంత్రి ప్రతిమా బౌమిక్ కావడం విశేషం. ప్రతిమా భౌమిక్ తండ్రి పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసేవారు.ఆమెకు ముగ్గురు తోబట్టువులు. స్వతహాగా క్రీడాకారిణి అయిన ప్రతిమా బౌమిక్ ,ఆమె బ్లాక్, జిల్లా మరియు రాష్ట్ర స్థాయి ఈవెంట్లలో ఖో-ఖో మరియు కబడ్డీ ఆడేది. అంతేకాదు తన స్వస్థలమైన సోనామురాలోని బరనారాయణ్‌లో వ్యవసాయం చేసేది.

ముఖ్యమంత్రి అవుతారనే ఊహాగానాల గురించి అడిగినప్పుడు, భౌమిక్ ఇలా అన్నారు.నేను అంకితభావంతో కూడిన పార్టీ కార్యకర్తను. పార్టీ కారణంగానే నేను మీ ముందు కూర్చున్నాను. పార్టీ ఆదేశాల మేరకే ఎన్నికల్లో పోటీ చేశాను, పార్టీయే నాకు తల్లి. కాబట్టి, ఎవరైనా ఏదైనా ఊహాగానాలు చేయకూడదు. పార్టీ ఏది చెబితే అది చేస్తాను అంటూ పేర్కొన్నారు. మరోవైపు త్రిపుర బీజేపీ చీఫ్ రాజీబ్ భట్టాచార్జీ మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లో బీజేపీ శాసన సభా పక్షం సమావేశమై నేతను ఎన్నుకుంటుందని చెప్పారు. మరి అంతా అనుకున్నట్లు జరిగితే ‘త్రిపుర దీదీ’ లేదా ‘ప్రతిమ ది’ అని పిలుచుకునే ప్రతిమా భౌమిక్ త్రిపురకు మొట్టమొదటి మహిళా సీఎం అవుతారు.

 

Exit mobile version