Site icon Prime9

Modi-Pawan Kalyan: హిమాలయాలకు వెళ్లాలని అనుకుంటున్నారా ఏంటి? జనసేనానితో ప్రధాని సరదా వ్యాఖ్యలు

PM Modi’s banter with Pawan Kalyan at Delhi CM oath ceremony: ఆరునూరైనా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి పక్షాన తామిచ్చిన హామీలను అమలుచేసి చూపుతామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. గురువారం ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి ఎన్డీయే మిత్రపక్ష పార్టీ అధినేత హోదాలో ఆయన హజరయ్యారు. ఆ కార్యక్రమం అనంతరం ఎన్డీయే మిత్రపక్షాలకు ప్రధాని ఇచ్చిన విందులోనూ పవన్ పాల్గొన్నారు. అనంతరం జాతీయ మీడియాతో పవన్ ఇష్టాగోష్టిగా ముచ్చటించారు.

ఢిల్లీలో ఒక కొత్త శకం
రానున్న రోజుల్లో ఢిల్లీలో సుపరిపాలన ప్రారంభం కానుందని, అద్భుతమైన అభివృద్ధి, అర్థవంతమైన సంక్షేమం అమలు కాబోతోందని జనసేనాని పేర్కొన్నారు. నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తాకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ద్వారా దేశాన్ని బలోపేతం చేయడమే మా అందరి లక్ష్యం. 27 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో బీజేపీకి దక్కిన ఈ అపూర్వ విజయం చరిత్రాత్మకమైనది. దీనికి ప్రధానికి, ఢిల్లీ సీఎంకు ఆల్ ది బెస్ట్’అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహిళకు సీఎంగా ఛాన్స్ ఇచ్చిన బీజేపీ అధిష్ఠానానికి, ప్రధాని మోదీకి జనసేనాని ప్రశంసించారు. ఇది మహిళా సాధికారతకు దోహదపడనుందని అభిప్రాయపడ్డారు.

ఇబ్బందులున్నా.. ముందుకే
రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వలోని పార్టీలతో సమన్వయం చేసుకుంటూ సుపరిపాలన అందించే దిశగా అడుగులు వేస్తున్నామని పనవ్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ప్రకటించిన హామీలను సైతం అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో జగన్ సర్కారు ఏపీని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. నాటి ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులలో పడిందని గుర్తుచేశారు. అయినప్పటికీ, ఓపికగా, ప్రాధాన్యత ప్రకారం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు పోతున్నామని తెలిపారు.

ఆ శాఖలంటే ఇష్టం
ఈ సందర్భంగా తనకు కేటాయించిన శాఖలపైన ఉపముఖ్యమంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘పర్యావరణ, అటవీ శాఖలు అంటే నాకెంతో ఇష్టం. పూర్తి నిబద్ధతతో నాకు కేటాయించిన మంత్రిత్వ శాఖ బాధ్యతలను నిర్వహిస్తున్నా’అని పవన్ వెల్లడించారు.
వెన్నునొప్పి కారణంగానే ఏపీలో కొన్ని సమావేశాలకు హాజరు కాలేకపోయానని.. ఇప్పటికీ వెన్న నొప్పి తీవ్రంగా బాధిస్తోందని, అయినా ఇటీవలి ఆధ్యాత్మిక యాత్రను పూర్తి చేయగలిగానని వివరించారు.

ప్రధానితో సరదా ముచ్చట
ఏ బహిరంగ సభలోనైనా పవన్ కనిపించగానే ప్రధాని మోదీ ఎంతో ఉత్సాహంగా స్సందిచటం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనూ ప్రధాని మోదీ.. పవన్‌తో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఓ చలోక్తి విసిరారు. ఈ కార్యక్రమానికి హాజరైన కీలక నేతలను వేదిక మీద కలుస్తూ వచ్చిన ప్రధాని.. పవన్ వద్దకు రాగానే ఆయన ధరించిన దీక్షా వస్త్రాలను చూసి, ‘ఏంటి.. ఇవన్నీ వదిలేసి హిమాలయాలకు వెళ్లాలని అనుకుంటున్నారా ఏంటి?’ అని సరదాగా ప్రశ్నించగా, దానికి పవన్ నవ్వుతూ అంతే సరదాగా స్పందిస్తూ.. ‘దానికి ఇంకా సమయముంది’అని బదులిచ్చారు. దీనికి ప్రధాని స్పందిస్తూ.. ‘అవును.. మీరు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్.. వాటిని మీరు నిర్వర్తించాల్సి ఉంది’అని చేతులు కలిపి ముందుకు సాగిపోయారు.

అభివృద్ధిపై మోదీ ఆరా..
కాగా, ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన ఎన్డీయే పక్ష నేతలతో మోదీ మాట్లాడారు. ఈ క్రమంలో ఏపీకి సంబంధించిన వివరాలను పవన్, చంద్రబాబులను అడిగి ప్రధాని తెలుసుకున్నారు. ఏపీలో అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి? రాజధాని అమరావతి స్థితిగతులు ఏమిటి? అని అడిగిన ప్రధాని, అక్కడి ప్రగతిని కేంద్రం అండగా ఉంటుందని ఇరువురు నేతలకు హామీ ఇచ్చారు. దీనికి ఇరువురు నేతలూ ప్రధానికి ధన్యవాదాలు తెలిపారు.

కేంద్రమంత్రితో భేటీ
కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తోనూ డిప్యూటీ సీఎం పవన్ భేటీ అయ్యారు. గురువారం ఉదయం ఏపీ సీఎం, ఎంపీల బృందంతో కలసి పవన్ సమావేశంలో పాల్గొన్నారు. కేంద్రమంత్రికి ఈ సందర్భంగా బృందం విజ్ఞప్తి చేసింది. పోలవరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేయడానికి అవసరమైన సహాయ సహకారాలు అందించటం, పోలవరం ఎడమ, కుడి కాలువల నిర్మాణానికి చేసిన ఖర్చును రీయింబర్స్ చేయాలని ఈ సందర్భంగా కేంద్రమంత్రిని ఏపీ బృందం కోరింది. అలాగే, పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కేంద్ర మంత్రి అందజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 200 టీఎంటీల వరద నీరు గోదావరిలోని పోలవరం నుంచి బనకచర్లకు పంపేందుకు లింక్ కెనాల్ ఏర్పాటు చేయాలనేది తమ ప్రతిపాదన అని, ఇది పూర్తి అయితే ఏపీ కరువు రహితంగా మారడంతో పాటు 80 లక్షల మందికి తాగునీరు, 3 లక్షల హెక్టార్ల నూతన ఆయకట్టు ఏర్పడుతుందని, మరో 9.14 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుందని కేంద్రమంత్రికి వివరించారు.

Exit mobile version
Skip to toolbar