PM Modi says Mauritius is Family: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటనలో భాగంగా మారిషస్ దేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మారిషస్ రాజధాని పోర్ట్ లూయిస్‌లో జరిగిన ప్రవాస భారతీయుల సమావేశంలో నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్, గ్లోబల్ సౌత్‌కు మధ్య మారిషస్ ఒక వారధి అని వెల్లడించారు.
మారిషస్ అనేది భాగస్వామ్య దేశం మాత్రమే కాదన్నారు. భారతదేశ కుటుంబంలో మారిషస్ ఓ భాగమని, మినీ ఇండియా అని మోదీ అభివర్ణించారు. కాగా, ప్రధాని మోదీకి మారిషస్ అత్యున్నత పురస్కారం అందించింది. మారిషస్ దేశ అత్యున్నత పురస్కారం ‘ ద గ్రాండ్ కమాండర్ ఆఫ్ ద ఆర్డర్ ఆఫ్ ద స్టార్ అండ్ కీ ఆప్ ద ఇండియన్ ఓషియన్’ అవార్డును అంగీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అలాగే ఈ అవార్డు భారత్, మారిషస్‌ల మధ్య ఉన్న చారిత్రక బంధానికి ఓ గౌరవమని చెప్పారు.
ఇదిలా ఉండగా, మారిషస్ జాతిపిత సీఓసాగర్ రామ్‌గులాం పేరు మీదుగా బొటానికల్ గార్డెన్ ఏర్పాటు చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఆ గార్డెన్‌ను సందర్శించారు. అనంతరం సీఓగులాం రామ్‌గులాంతో పాటు ఆ దేశాధ్యక్షుడు అనిరుద్ధ్ జగన్నాథ్ సమాధుల వద్ద మోదీ నివాళులర్పించారు.
ఇందులో భాగంగానే ఆ దేశ ప్రధానితో కలిసి ప్రధాని మోదీ మొక్కలు నాటారు. ఈ ఫోటోను ప్రధాని ఎక్స్ వేదికగా షేర్ చేశారు. ఇందులో ‘ఏక్ షేడ్ మా కే నామ్’ ప్రోగ్రాంలో స్నేహితుడు నవీన్ కూడా హాజరుకావడం సంతోషమన్నారు. ప్రకృతి, మాతృత్వం, స్థిరత్వానికి గుర్తుగా ఈ మొక్క నిలుస్తుందని రాసుకొచ్చారు.