PM Modi at Advantage Assam 2.0: అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వశర్మ పాలనలో అసోం అన్ని రంగాల్లో పురోగమిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన చేశారు. గౌహతిలో అడ్వాంటేజ్ అసోం 2.0 బిజినెస్ సమ్మిట్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. గత ఆరేళ్ల బీజేపీ పాలనలో అసోం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి రెట్టింపు అయిందని, దేశాభివృద్ధిలో అసోం భాగస్వామ్యం నానాటికీ పెరగటం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు.
ప్రగతి కేంద్రంగా ఈశాన్యం
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. తూర్పు, ఈశాన్య ప్రాంతాలు దేశం భవిష్యతులో కొత్త ప్రయాణానికి శ్రీకారం చుట్టాయన్నారు. అందులో భాగంగా అసోం పురోగతి.. ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలుస్తోందన్నారు. ఆ సమయంలో ఈ రాష్ట్ర ఆర్థికాభివృద్ధి విలువ రూ. 2.75 లక్షల కోట్లు ఉండగా.. ప్రస్తుతం రూ. 6 లక్షల కోట్లకు చేరుకుందని ప్రధాని మోదీ వివరించారు.
అనుసంధానంతో అభివృద్ధి
అలాగే బీజేపీ పాలనలో జరిగిన అభివృద్ధిని సైతం ఆయన విపులీకరించారు. 2014కు ముందు అసోంలోని బ్రహ్మపుత్ర నదిపై మూడు బ్రిడ్జిలు మాత్రమే ఉండేవని. కానీ గత పదేళ్లలో ఈ నదిపై నాలుగు కొత్త బ్రిడ్జిలు నిర్మించామని తెలిపారు. అంతకుముందు యూపీఏ హయాంలో 2009 నుంచి 2014ల మధ్య అసోంకు రూ. 2,100 కోట్ల మేర రైల్వే బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. కానీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేటాయింపులు రూ.10 వేల కోట్లుకు చేరుకుందని ప్రధాని మోదీ చెప్పారు. అలాగే యూపీఏ హయాంలో అసోంకు కేవలం 7 మార్గాల్లోనే విమానాలు నడిచేవన్నారు. కానీ ఏన్డీఏ ప్రభుత్వ హయాంలో వాటి సంఖ్య 30 మార్గాల్లో విమాన సర్వీసులు నడుస్తున్నాయని వివరించారు. దేశంలో దొరికే సహజవాయువులో సగం అసోం నుంచే వస్తోందని, ఇక్కడి రిఫైనరీల కెపాసిటీని గణనీయంగా పెంచామన్నారు.
తయారీ హబ్‌గా..
ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్, గ్రీన్ ఎనర్జీ తదితర రంగాలలో అసోం దూసుకు పోతోందని, ఈశాన్య భారతావనిలో అసోం అతిపెద్ద తయారీ హబ్‌గా మారేందుకు మరెంతో కాలం పట్టదని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు. అసోంకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఈ సదస్సుకు టాటా, రిలయన్స్, అదానీ, వేదాంత, జేఎస్‌డబ్ల్యూ గ్రూపుల అధినేతలతో బాటు 60 దేశాల ప్రతినిధులు, పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యారు.