Adipurush Movie: విడుదలకి ముందే సినిమా పాత్రల విషయంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఆదిపురుష్ సినిమా ఇప్పుడు న్యాయ పరమైన వివాదాల్లో చిక్కుకుంది. ఆదిపురుష్ సినిమాపై ఢిల్లీ హైకోర్టులో పిల్ దాఖలైంది. హిందూ సేన జాతీయ అధ్యక్షుడు ఈ పిల్ దాఖలు చేశారు.
అభ్యంతరకర దృశ్యాలని తొలగించాలి..(Adipurush Movie)
శ్రీరాముడు, సీత, ఆంజనేయుడు, రావణుడి పాత్రలకి సంబంధించిన అభ్యంతరకర దృశ్యాలని తొలగించాలని హిందూ సేన డిమాండ్ చేసింది. రామాయణంలోని క్యారెక్టర్ల గెటప్‌లకి భిన్నంగా ఆదిపురుష్‌లో పాత్రలని చూపించారని కోర్టు దృష్టికి తెచ్చారు. శ్రీరాముడు, సీత, హనుమంతుడి రూపాలకి సంబంధించి హిందువుల మనస్సుల్లో ఒక బలమైన భావన ఉందని పిటిషన్‌లో పేర్కొన్నారు. హిందువుల మనస్సుల్లో ఉన్న పవిత్రమైన రూపాన్ని మార్చడం, టాంపర్ చేయడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమా నిర్మాతలు, దర్శకులు, నటీనటులు దీనికి అంగీకరించడం హిందువుల ప్రాథమిక హక్కులకి భంగం కలిగించడమేనని హిందూసేన అంటోంది.
మతపరమైన పాత్రలని చెడుగా చిత్రీకరించారని, ఇది హిందూ నాగరికతని, హిందూ దేవుళ్ళని అవమాన పరచడమేనని హిందూ సేన అంటోంది. పురాణాల్లో దేవుళ్ళ పాత్ర చిత్రీకరణ బాగానే ఉన్నా ఆది పురుష్ సినిమాలో మాత్రం హిందూ భక్తుల మనోభావాలని దెబ్బ తీశారని హిందూ సేన మండిపడింది. ఇన్ని లోపాలున్నందున ఈ సినిమా ప్రదర్శనని నిలిపి వేయాలని హిందూ సేన డిమాండ్ చేసింది. ఈ సినిమాలోని లోపాలని సరిదిద్దే వరకూ రాజ్యాంగంలోని 26వ అధికరణం ప్రకారం ప్రదర్శనని నిషేధించాలని హిందూ సేన ఢిల్లీ హైకోర్టుని కోరింది.