Site icon Prime9

Pawan Kalyan: దటీజ్ పవన్.. మరాఠీ నేలపై తెలుగు పవనం

Pawan Kalyan Effect On Maharashtra Election Results 2024: మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం.. జనసేన పార్టీ శ్రేణులను ఆనందంలో ముంచెత్తింది. ఈ ఎన్నికల్లో జనసేనాని ప్రచారం చేసిన సీట్లన్నింటిలో ఎన్డీయే అభ్యర్థులే విజయం సాధించటంతో వారు పండుగ చేసుకుంటున్నారు. దీంతో పవన్‌స్టార్ ఎక్కడ అడుగుపెడితే అక్కడ విజయమేనని, గతంలో ఏపీ ఎన్నికల్లో పోటీచేసిన సీట్లన్నీ గెలిచినట్లే, మహారాష్ట్రలోనూ ప్రచారం చేసిన సీట్లన్నీ గెలవగలిగారని అభిమానులు సంబరపడిపోతున్నారు.

సరిహద్దు జిల్లాల్లో హవా
తెలంగాణాతో సరిహద్దు పంచుకునే మహారాష్ట్ర జిల్లాలలో పవన్ చేత ప్రచారం చేయించాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఈ క్రమంలో ఆయన పుణే, బల్లార్ పూర్, షోలాపూర్, డెత్లూర్, లాతూర్‌లలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ స్థానాల్లో కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థులైన.. కాంబ్లె సునీల్ ధ్యాన్ దేవ్(పుణే), ముంగంటివార్ సుధీర్ సచ్చిదానంద్ (బల్లార్ పూర్), దేశ్‌ముఖ్ సుభాష్ సురేశ్‌చంద్ర (షోలాపూర్), అంతపుర్కర్ జితేష్ రాయ్ సాహెబ్(డెత్లూర్), రమేష్ కాశీరామ్ కరద్ (లాతూర్‌) లు విజయం సాధించారు. దీంతో పవన్ ప్రచారం సానుకూల ప్రభావం చూపిందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.

ఆయన వల్లే గెలిచా..
షోలాపూర్ సిటీ సెంట్రల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి దేవేంద్ర రాజేష్ కోఠే పవన్ కళ్యాణ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎన్నికల్లో గెలవడానికి పవన్ కళ్యాణ్ ఒక్కడే కారణమని బహిరంగంగానే ప్రకటించారు. పవన్ ఎన్నికల ప్రసంగాలు ఓటర్లను పెద్ద ఎత్తున ప్రభావితం చేశాయని, నిర్ణయాత్మకమైన 45,000 మెజారిటీ సాధించడంలో సహాయపడిందని దేవేంద్ర రాజేష్ పేర్కొన్నారు. తనకు మద్దతుగా ప్రచారానికి వచ్చిన పవన్ కల్యాణ్‌కు, ఆయన అభిమానులకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నానని దేవేంద్ర ప్రకటించారు.

సనాతనమే సమున్నతం
ఈ ఎన్నికల్లో పవన్ తాను పాల్గొన్న సభలన్నింటిలోనూ మహారాష్ట్ర నేల గొప్పదనం గురించి, అక్కడి మహాపురుషులు గురించి ప్రస్తావించారు. శివాజీ, అంబేద్కర్, జిజియాబాయి, బాలాసాహెబ్ థాక్రే వంటి నేతల స్ఫూర్తితోనే తాను జనసేనను స్థాపించిన విషయాన్నీ వెల్లడించారు. సనాతన ధర్మం మీద అవాకులు చెవాకులు పేలుతున్న ఎంఐఎం పార్టీ మీద పవన్ నిప్పులు చెరిగారు. మహారాష్ట్రలోని బాల్ థాక్రే స్ఫూర్తితోనే ప్రాంతీయ ఆకాంక్షలకు భంగం కలిగించని జాతీయ వాదాన్ని తాను ఎప్పటికీ సమర్ధిస్తానని స్పష్టం చేశారు. పవన్ ప్రసంగాలు, నటుడిగా ఆయనకున్న చరిష్మా, నేతగా సనాతన ధర్మం పట్ల ఆయనకున్న స్పష్టత, మరాఠీలో ఆయన ప్రసంగాలు సాగిన తీరు అక్కడి ఓటర్లలో ఎన్డీయే పట్ల సానుకూల ప్రభావాన్ని కలిగించాయని అక్కడ విజేతలుగా నిలిచిన అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తూ వెల్లడిస్తున్నారు.

Exit mobile version