Site icon Prime9

Parliament Winter session: నేటి నుంచే పార్లమెంట్‌ సమావేశాలు.. 16 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం

Parliament Winter Session Begins from Today: నేటి నుంచి పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 25 నుంచి మొదలయ్యే పార్లమెంట్‌ సమావేశాలు డిసెంబరు 20న ముగియనున్నాయి. ఈ క్రమంలో నవంబరు 26న పాత పార్లమెంటు భవనంలోని సంవిధాన్‌ సదన్‌ సెంట్రల్‌ హాల్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులును ఆమోదించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతుండగా, పలు అంశాల మీద ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ నాయకత్వంలోని ఇండియా కూటమి పార్టీలు వ్యూహరచనతో ముందుకొస్తున్నాయి.

మొత్తం 16 బిల్లులు
సమావేశాల్లో పెండింగ్‌లో ఉన్న వక్ఫ్‌ సవరణ బిల్లుతోపాటు మొత్తం 16 బిల్లులను ఈ సమావేశాల్లో కేంద్రం ప్రవేశపెట్టనున్నది. ఆగస్టులో సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్‌ సవరణ బిల్లును ఉభయ సభల జాయింట్‌ కమిటీ అధ్యయనం కోసం పంపారు. శీతాకాల సమావేశం ప్రారంభమైన తొలివారం ఆఖరిరోజు ఈ నివేదిక సమర్పించాలని గతంలోనే నిర్ణయించారు. అయితే, జేపీసీ కమిటీ కాల పరిమితిని మరింత పెంచాలని విపక్షం కోరుతోంది. వివాదాస్పద వక్ఫ్ బిల్లు విషయంలో ఈసారి లోక్‌సభలో రగడ జరిగే అవకాశం ఉంది.

వ్యూహాత్మకంగా రంగంలోకి విపక్షాలు
ఈసారి అదానీ అరెస్ట్ వారెంట్ అంశంతో ప్రభుత్వాన్ని గుక్కతిప్పుకోనివ్వకుండా చేయాలని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ అంశంలో వామపక్షాలూ, డీఎంకే, టీఎంసీ వంటి పలు పక్షాలు కాంగ్రెస్‌తో గొంతుకలిపేలా ఉన్నాయి. అలాగే, వక్ఫ్ బిల్లు విషయంలోనూ సభలో గందళగోళం చెలరేగే అవకాశం ఉంది.

జమిలిపై కేంద్రం వెనక్కి..
జమిలి ఎన్నికలపై రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇచ్చిన నివేదికను మంత్రివర్గం ఇదివరకే ఆమోదం తెలిపింది. పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల ఎజెండాలో ఈ బిల్లు లేనప్పటికీ, సమావేశాలు ముగిసే నాటికి దీనిని అనూహ్యంగా తెరమీదికి తెచ్చే అవకాశాలను కొట్టిపారేయలేమని కొన్ని పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇక, సభ ముందుకు రానున్న ఐదు కొత్త బిల్లులలో కోస్టల్‌ షిప్పింగ్‌ బిల్లు, ద ఇండియన్‌ పోర్ట్స్‌ బిల్లు, మర్చంట్‌ షిప్పింగ్‌ బిల్లు, కో-ఆపరేటివ్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు రాష్ట్రీయ సహకార విశ్వవిద్యాలయ బిల్లు, పంజాబ్‌ కోర్ట్స్‌ (సవరణ) బిల్లు ఉన్నాయి.

Exit mobile version