NEET Aspirant: చెన్నై లో ఆదివారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్షా కేంద్రం వద్ద పరీక్ష రాయడానికి వచ్చిన అమ్మాయిని తన బ్రా తొలగించాలంటూ నిర్వాహకులు బలవంతం చేసారని ఒక జర్నలిస్టు చేసిన ట్వీట్ సంచలనం కలిగించింది.
ఈ సంఘటనపై తన పేరు చెప్పడానికి ఇష్టపడని చెన్నైకి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ ట్వీట్ చేశారు. నీట్ పరీక్షా కేంద్రం వద్ద ఒక అమ్మాయి ఒక మూలన అసౌకర్యంగా కూర్చోవడం తాను చూశానని, ఆమె ముందుకు వెళ్లి, అమ్మాయికి అంతా బాగానే ఉందా అని అడిగినట్లు చెప్పారు. దీనితో ఆమె జరిగిన సంఘటన మొత్తాన్ని వివరించింది. పరీక్ష రాసేటప్పుడు బ్రా తీసేయమని అడిగారని చెప్పింది. అది విన్న జర్నలిస్ట్ ఆమెకు కప్పుకునేలా శాలువా అందించారు. అయితే, తన సోదరుడు తనను తీసుకెళ్లేందుకు దారిలో ఉన్నాడని అది తీసుకునేందుకు నిరాకరించింది.
నన్ను కాదు నిర్వాహకులను అడగండి..(NEET Aspirant)
అయితే నెటిజన్లు జర్నలిస్ట్ ట్వీట్ ను ట్రోల్ చేసారు, తరువాత దానిని తొలగించమని ఆమెను బలవంతం చేశారు. అయితే, ఆమె అక్కడితో ఆగలేదు .పరీక్షకు హాజరవుతున్న చాలా మంది అమ్మాయిలు బ్రాలు ధరించడం లేదని రాసింది.నన్ను అసభ్యకరమైన ప్రశ్నలు అడిగే వారు బ్రా ధరించడానికి అనుమతిస్తారా లేదా అని పరీక్ష బోర్డుని అడగాలని ఆమె ట్వీట్ చేసింది.పరీక్షలు రాసేటప్పుడు మహిళలు బ్రాలు ధరించకుండా చేసిన ఘటనలు ఈ మధ్య కాలంలో అనేకం ఉన్నాయి. గత సంవత్సరం కేరళలో, మార్ థోమా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో పరీక్ష రాయడానికి అనుమతించే ముందు ‘భద్రత’ కారణాలతో విద్యార్థులు తమ బ్రాలను బలవంతంగా తొలగించారని వార్తలు వచ్చాయి.
ఈ ఘటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యమొళి మాట్లాడుతూ ఇలాంటి చర్యలను సీఎం స్టాలిన్ తీవ్రంగా ఖండించారని తెలిపారు. గత మూడేళ్లుగా జరుగుతున్న నీట్‌లో ప్రతి విద్యార్థి హెయిర్‌పిన్, డ్రెస్సులు తొలగించి తనిఖీ చేస్తున్న తీరును మహేష్ ఖండించారు.బీజేపీ అధికార ప్రతినిధి నారాయణన్ తిరుపతి ఈ చర్యను విమర్శిస్తూ, అటువంటి ఉల్లంఘన జరిగితే, దానికి బాధ్యులను కఠినంగా శిక్షించాలని అన్నారు.