Site icon Prime9

Chhattisgarh: రావణదహనం సరిగా చేయలేదని మున్సిపల్ క్లర్కు సస్పెన్షన్

Ravana

Ravana

Raipur: సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు విధినిర్వహణలో విఫలమైతే వారిని సస్పెండ్ చేయడం పరిపాటి. కాని చత్తీస్ గడ్ లో రావణదహనం సరిగా చేయలేదంటూ ఒక మున్పిపాలిటీ ఉద్యోగిని సస్పెండ్ చేసారు. రాజేంద్ర యాదవ్ రాయ్‌పూర్‌కు దక్షిణంగా 90 కి.మీ దూరంలో ఉన్న ధమ్‌తరి మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తున్నారు. ఛత్తీస్‌గడ్ ధంతారి మున్సిపాలిటీ అధికారులు దసరా రోజున రామ్‌లీలా మైదానంలో రావణుడి బొమ్మను ఏర్పాటు చేశారు. దుర్గా పూజా చివరి రోజున ఈ బొమ్మను దహనం చేశారు. అయితే, ఆ రావణుడి బొమ్మ పది తలలు మినహా మొత్తం కాలిపోయింది. ఆ పది తలలు మాత్రం అలాగే చెక్కు చెదరకుండా ఉండిపోయాయి. దీంతో దంతారి మున్సిపల్ కార్పొరేషన్ క్లర్క్ రాజేంద్ర యాదవ్ పై సస్పెన్షన్ వేటు వేసింది. రావణుడి బొమ్మ తయారు చేయడంలో నిర్లక్ష్యం వహించారని ఆయన పై ఈ వేటు వేశారు.

దసరా ఉత్సవ్ కోసం, రావణుడి దిష్టిబొమ్మను సిద్ధం చేస్తున్నప్పుడు రాజేంద్ర యాదవ్ తీవ్రమైన బాధ్యతారాహిత్యానికి పాల్పడ్డారు. ఆయన చర్య మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిష్టకు చెడ్డపేరు తెచ్చిపెట్టింది. విధి నిర్వహణలో అజాగ్రత్తగా వ్యవహరించడాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే సస్పెండ్‌ చేశాం అని కమిషనర్‌ వినయ్‌ పోయామ్‌ సంతకంతో కూడిన సస్పెన్షన్‌ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరో ఉద్యోగి సమర్థ్ రనసింగ్‌కు ఆయన బాధ్యతలు ఇచ్చినట్టు డీఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ రాజేశ్ పదంవార్ తెలిపారు. అసిస్టెంట్ ఇంజినీర్ విజయ్ మెహ్రా, సబ్ ఇంజినీర్లు లొమస్ దేవాంగన్, కమలేశ్ ఠాకూర్ కమట నాగేంద్రలకు షోకాజ్ నోటీసులు పంపారు. రావణుడి బొమ్మ తయారీ బాధ్యతలు అప్పగించిన వారిపై యాక్షన్ తీసుకున్నామని, ఇప్పుడు ఆ బొమ్మ తయారు చేసిన వారికీ డబ్బులు ఇవ్వకుండా నిలిపేశామని వివరించారు. బొమ్మ మొత్తం కాలి బూడిదైనా, తలలు మాత్రం చెక్కు చెదరకపోవడానికి వాటిని సరిగా తయారు చేయలేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

Exit mobile version