Bus Fall Down in Valley at Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. మండీ జిల్లా పత్రీఘాట్ సమీపంలోని సర్కాఘాట్ వద్ద బస్సు లోయలో పడిపోయింది. ప్రమాదంలో 25 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. కాగా ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్టు సమాచారం.
ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మట్టిలో కూరుకుపోయారు. కాగా భారీ వర్షమే ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. దీంతో బస్సు అదుపుతప్పి 200 మీటర్ల లోతైన లోయలోకి పడిపోయింది. కాగా కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రహదారులపైకి భారీగా వరదనీరు, బురద చేరుతోంది. దీంతో వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.