Miss World: భారత్ మరోసారి ప్రపంచ సుందరి ఎంపిక పోటీలకు వేదిక కానుంది. దాదాపు 27 సంవత్సరాల తర్వాత ప్రపంచ సుందరి పోటీలకు దేశం ఆతిథ్యం ఇస్తోంది. ప్రపంచ సుందరి 2023 పోటీలు రానున్న నవంబర్ లో దేశంలో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 130 దేశాలకు చెందిన అందగత్తెలు ఈ పోటీల్లో పాల్గొననున్నారు. నెల రోజుల పాటు దేశంలో విడిది చేస్తారు. ఈ పోటీల్లో భాగంగా పలు ప్రదర్శనలు, క్రీడల్లో ప్రతిభ, సేవాతత్వ దృక్పధం లాంటి కార్యక్రమాలతో ఈ పోటీలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ ఛైర్ పర్సన్, సీఈవో జులియా మోర్లే తెలిపారు. గొప్ప ఆతిథ్యం, విలువలకు ప్రతిరూపమైన భారత్ లో అందమైన ప్రపంచ సుందరి కిరీటాన్ని తదుపరి విజేతకు ఇచ్చేందుకు ఆనందంగా ఎదురుచూస్తున్నానని గత ఏడాది ప్రపంచ సుందరి విజేత కరోలినా బియెలావ్ స్కా తెలిపారు.
ఆరుసార్లు టైటిల్ గెలిచిన భారత్(Miss World)
కాగా, ఈ అంతర్జాతీయ పోటీలకు 1996 లో భారత్ వేదికైంది. మళ్లీ 27 ఏళ్లకు 71 వ ప్రపంచ సుందరి 2023 ఫైనల్స్ ఇక్కడ జరగనున్నాయి. అయితే తేదీలు ఇంకా ఖరారు కాలేదని నిర్వాహకులు తెలిపారు.
ప్రతిష్ఠాత్మకమైన ఈ ప్రపంచ సుందరి టైటిల్‌ను భారత్ ఇప్పటికి 6 సార్లు గెలిచింది. రీటా ఫరియా (1966), ఐశ్వర్యారాయ్ (1994), డయానా హెడెన్ (1997), యుక్తాముఖి (1999), ప్రియాంకా చోప్రా (2000), మానుషి చిల్లర్ (2017) లు భారత్ నుంచి ప్రపంచ సుందరీ మణులుగా నిలిచారు.