Lok Sabha Speaker: పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో స్పీకర్ పదవిపై సస్పెన్స్ కొనసాగుతోంది. లోకసభ కొత్త స్పీకర్ ఎంపిక కోసం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నివాసంలో మంత్రులు మంగళవారం సాయంత్రం సమావేశమై ఓ నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. లోకసభ ఎన్నికలు ముగిసిన తర్వాత మొట్టమొదటి లోకసభ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా కొత్త లోకసభ స్పీకర్ ఎంపికను ఎన్‌డీఏ భాగస్వాములతో కలిసి తుది నిర్ణయానికి రావాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. కాగా స్పీకర్ పోస్ట్‌కు ఈ సారి ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తోంది. కాగా బీజేపీ అధిష్టానం రాజ్‌నాథ్‌సింగ్ బాధ్యత అప్పగించి .. మిత్రపక్షాలతో పాటు ప్రతిపక్ష పార్టీలతో కలిసి స్పీకర్‌పై ఏకగ్రీవానికి రావాలనే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు సమాచారం.
ఇక ప్రతిపక్ష ఇండియా కూటమికి విషయానికి వస్తే.. డిప్యూటీ స్పీకర్ పోస్ట్‌ను నిబంధనల ప్రకారం ప్రతిపక్షాలకు ఇవ్వాల్సి ఉంటుంది. ఒక వేళ డిప్యూటీ స్పీకర్ పోస్ట్‌ను ప్రతిపక్షాలకు ఇవ్వకుంటే స్పీకర్ పదవికి తమ అభ్యర్థిని పోటీకి నిలుపుతామని ప్రతిపక్షాలకు పరోక్షంగా హెచ్చరిస్తున్నాయి. కాగా లోకసభ స్పీకర్ ఎన్నిక ఈ నెల 26న జరుగనుంది. ప్రస్తుతం లోకసభలో స్పీకర్ పదవిని బీజేపీ ఎంపీ ఓంబిర్లా నిర్వహిస్తున్నారు. 17వ లోకసభ ఎన్నికల తర్వాత జూన్ 2019లో ఓం బిర్లాను స్పీకర్ పదవికి ఎన్నుకున్నారు. కాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓం బిర్లా పేరును ప్రతిపాదించారు.
ఇటీవల ముగిసిన లోకసభ ఎన్నికలో ఓం బిర్లా బీజేపీ తరఫున రాజస్థాన్‌లోని కోటా నుంచి 41,139 ఓట్ల మార్జిన్‌తో గెలుపొందారు. ఇక బిహార్ ముఖ్యమంత్రి (జెడి యు) ఇప్పటికే బీజేపీ ప్రాతిపాదించిన అభ్యర్థికి మద్దతు ఇస్తామని ప్రకటించారు. జెడి యు, తెలుగుదేశం ఎన్‌డీఏలో భాగస్వామి పార్టీలు. కాగా లోకసభ స్పీకర్ పదవికి బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థిని జెడియు, టీడీపీలు మద్దతు తెలుపుతాయి. కాగా 18వ లోకసభ సమావేశాలు జూలై 3న ముగుస్తాయి. కొత్తగా లోకసభకు ఎంపికైన సభ్యుల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుంది. ఇదిలా ఉండగా ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము లోకసభ, రాజ్యసభను ఉద్దేశించి ఈ నెల27న ప్రసంగించనున్నారు. కాగా 17వ లోకసభ బడ్జెట్ సెషన్ ఈ ఏడాది జనవరి 31 నుంచి ఫిబ్రవరి 10వ తేదీ వరకు జరిగిన విషయం తెలిసిందే.