Chennai: దసరా ఉత్సవాలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తుంటారు. అంగరంగ వైభవంగా నిర్వహించేలా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేస్తుంటారు. ఈ క్రమంలోనే తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖర పట్నంలో దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తుంటారు. ముత్తాలమ్మన్ ఆలయంలో నిర్వహించే నవరాత్రుల ఉత్సవాల్లో అశ్లీల నృత్యాల ప్రదర్శనలు, సినిమా పాటలు హోరెత్తుతూ భక్తులను తీవ్ర ఇబ్బంది పెడుతుంటాయి. దీంతో ఉత్సవాల పేరిటి ఏర్పాటు చేసే అశ్లీలతను నిరోధించాలంటూ సామాజిక కార్యకర్త రాం కుమార్ మద్రాసు కోర్టు మెట్లెక్కారు.
దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం వాదనల అనంతరం చక్కని ఆదేశాలు జారీ చేసింది. దసరా ఉత్సవాల్లోనే కాకుండా ఇక పై ఏ ఆలయ వేడుకల్లోనూ అశ్లీల నృత్యాలు, సినిమా పాటలు పెట్టకూడదని స్పష్టం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. భక్తి గీతాలతోనే కార్యక్రమాలను చేసుకోవాలంటూ ప్రత్యేకించి మరీ ఆదేశించింది. దీంతో భక్తి భావాన్ని కోరుకొనే వారంతా ఆనందంలో మునిగిపోయారు. అయితే కోర్టు ఆదేశాలను తమిళనాడు పోలీసులు ఏమేరకు అమలుచేస్తారో ఈ దసరా ఉత్సవాల్లో బయటపడనుంది.