Tamil Nadu: తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించింది మద్రాస్ హైకోర్టు. దేవాలయాలలో మొబైల్ ఫోన్ వాడకాన్ని నిషేధించే చర్య ప్రార్థనా స్థలాల స్వచ్ఛత మరియు పవిత్రతను కాపాడటానికి అని కోర్టు పేర్కొంది. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు ఆలయాల వద్ద ఫోన్ డిపాజిట్ లాకర్లు ఏర్పాటు చేయాలని కోర్టు పేర్కొంది.ఈ ఆదేశాన్ని పాటించేలా భద్రతా సిబ్బందిని కూడా నియమిస్తారు.
ఈ సందర్భంగా గురువాయూర్లోని శ్రీకృష్ణ దేవాలయం, మధురైలోని మీనాక్షి సుందేశ్వరాలయం, తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర దేవాలయంలలో మొబైల్ ఫోన్ల పై నిషేధం విజయవంతంగా నడుస్తుందని చెప్పింది ధర్మాసనం.తిరుచెందూర్ ఆలయంలో అటువంటి చర్యలే తీసుకొని, ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను వాడకుండా నిషేధించాలని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాల మేరకు తిరుచెందూర్ దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఒక నివేదికను సమర్పిస్తూ దేవాలయం ప్రాంగణంలో మొబైల్ ఫోన్లను వాడకుండా దాదాపుగా అన్ని గ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు.
తిరుచెందూర్ సుబ్రమణ్య స్వామి ఆలయంలో మొబైల్ ఫోన్ల వినియోగంపై నిషేధం విధించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు ఈ ఉత్తర్వులు జారీ చేసింది. మొబైల్ ఫోన్‌లు ప్రజల దృష్టి మరల్చడంతోపాటు దేవతా చిత్రాలను క్లిక్ చేయడం ఆగమ నిబంధనలను ఉల్లంఘించడమేనని పిటిషనర్ వాదించారు. ఫొటోగ్రఫీ వల్ల దేవాలయాల భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని, తమ అనుమతి లేకుండా తమ చిత్రాలను క్లిక్ చేయడంపై మహిళల్లో భయాందోళనలు నెలకొంటాయని ఆయన అన్నారు.