Amritsar: అమృత్‌సర్ పోలీసులు ఖలిస్తానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌తో పాటు ఆయన అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్‌ను జైలు నుంచి విడుదల చేశారు. కిడ్నాప్ కేసు కింద వీరిని అరెస్టు చేశారు. గురువారం అమృత్‌సర్ నగరం రణరంగం మారింది. అమృత్‌పాల్‌సింగ్ మద్దతు దారులు పోలీసుస్టేషన్‌పై దాడికి దిగి పలువురు పోలీసులను కూడా గాయపర్చారు. కాగా అమృత్‌పాల్ సింగ్ మాత్రం ప్రత్యేక ఖలిస్తాన్ దేశం కోసం పట్టుబడుతున్నాడు. ఇదిలా ఉండగా పోలీసులు లవ్‌ప్రీత్‌సింగ్ తుఫాన్‌ను జైలు నుంచి విడుదల చేస్తూ ఆయన కిడ్నాప్ కేసులో నిందితుడు కాదని తేల్చి చెప్పారు. తుఫాన్‌ను విడుదల చేయాలని వేలాది మంది అమృత్‌పాల్‌సింగ్ మద్దతు దారులు పోలీసు స్టేషన్‌ను ముట్టడించారు. గంటలోగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ర్టంలో శాంతి భద్రతలు భగ్నం కలిగిస్తామని హెచ్చరించారు.
అమిత్ షా కు వార్నింగ్ ఇచ్చిన అమృత్‌పాల్ సింగ్ ..(Amritsar)
అమృత్‌పాల్ ఖలిస్తాన్ సానుభూతిపరుడు.బింద్రేన్‌వాలే 2.0గా ఆయనను అందరూ సంబోధిస్తున్నారు. ఇటీవల ఆయన వారిస్ పంజాబ్ డే హెడ్‌గా నియమించబడ్డారు. వారిస్ పంజాబ్ దేను దీప్ సిద్దూ స్థాపించారు. గత ఏడాది ఆయన మృతి చెందారు. అమృత్‌పాల్ సింగ్ దుబాయి నుంచి వచ్చి తన కుటుంబానికి చెందిన ట్రాన్స్‌పోర్టు వ్యాపారం చేస్తూ.. వారిస్ పంజాబ్ దేకు ప్రవచనాలు చేస్తున్నాడు 29 ఏళ్ల అమృత్‌పాల్ సింగ్. అమృతసర్‌లోని జల్లాపూర్ ఖేరాకు చెందిన అమృత్‌పాల్ ఇటీవల కాలంలో వివాదాస్పద ప్రసంగాలు చేశారు. వాటిలో ప్రధానమైంది కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేశారు. మాజీ ప్రధానమంత్రి స్వర్గీయ ఇందిరాగాంధీకి పట్టిన గతే అమిత్‌షాకు పడుతుందని హెచ్చరించారు. ఇటీవలే అమృత్‌పాల్‌సింగ్ బ్రిటన్‌కు చెందిన ఎన్‌ఆర్‌ఐ కిరణ్ దీ కౌర్‌ను వివాహం చేసుకున్నాడు.
కిడ్నాప్ కేసులో తూఫాన్ సింగ్..
తుఫాన్ సింగ్ అమృత్‌పాల్ సింగ్ అనుచరుడు. చమకౌర్ సాహిబ్ ప్రాంతానికి చెందిన బారిందర్ సింగ్‌ను కిడ్నాప్ చేశాడు. ఈ కేసులో నిందితుడిగా అమృత్‌పాల్ సింగ్ పేరును చేర్చారు పోలీసులు. పోలీసులతో జరిగిన ఘర్షణ తర్వాత అమృత్‌పాల్ సింగ్ మాట్లాడుతూ పోలీసుల చర్యల వల్లే నిన్న ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలీసులు తమ మాట వినలేదని, లవ్‌ప్రీత్‌సింగ్ ఈ కేసులో అమాయకుడని తాము సాక్ష్యాధారాలు కూడా చూపించామని అన్నారు. నిన్నటి ఉద్రిక్తత పరిస్థితులకు పోలీసులే కారణమని.. తాము కాదని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు తమకు కొంతం గడువు కావాలని అడిగారు. నిన్నిటి వరకు ఇచ్చామని, గడువు తీరాక నిన్న పోలీసుస్టేషన్‌కు వచ్చి లవ్‌ప్రీతిసింగ్‌ను విడిపించాలని కోరామని చెప్పాడు అమృత్‌పాల్.
తాజా పరిణామాలపై మంత్రి కుల్‌దీప్ సింగ్ దలీవాల్ స్పందించారు. పంజాబ్ ప్రజలకు ముఖ్యమంత్రి భగవంత్‌మాన్‌పై నమ్మకం ఉండాలన్నారు. నిన్నటి పరిస్థితిని పోలీసులు చక్కగా అదుపు చేశారని ఆయన పోలీసులను అభినందించారు. గురుగ్రంధ్ సాహిబ్‌కు అపవిత్రం జరగకుండా పోలీసు అడ్డుకున్నందుకు వారికి సెల్యూట్ చేస్తున్నానని అన్నారు. గాయపడిన ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అజ్నాలాలో జరిగిన ఘటన వెనుక ఉద్దేశం ఏమిటో ప్రజలు బాగా తెలుసన్నారు మంత్రి.
వారిస్ పంజాబ్ దే అంటే ఏమిటి ? ..
వారిస్ పంజాబ్ దే పేరు విషయానికి వస్తే.. పంజాబ్ వారసులం అని దీని అర్ధం. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దీన్ని దీప్ సంధు సెప్టెంబర్ 30, 2021లో స్థాపించారు.
తాజాగా అమృత్‌సర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిష్టి బొమ్మను క్రెన్‌కు వేలాడదీసి ప్రదర్శనగా తీసుకువెళ్లారు ఖలిస్తాన్ సానుభూతి పరులు. అయితే ఒక్క సిక్కు కూడా దీన్ని అడ్డుకోవడానికి సాహసించలేదు. ఒక వేళ పరిస్థితి ఇలానే కొనసాగితే పంజాబ్ కూడా పాకిస్తాన్ మాదిరిగా టెర్రరిస్టు కార్యకలాపాలకు అడ్డగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే కెనడాలో కూడా ఖిలిస్తానీ సానుభూతి పరులు పెద్ద ప్రదర్శన నిర్వహించారు. భారత్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు. భారత్ మాతా చోర్ హై అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. కాగా కేంద్రప్రభుత్వం ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణిచి వేయాల్సిందే. ఇప్పటికే ఖలిస్తానీ తీవ్రవాదులు చేతిలో ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. చాప కింద నీరులా ఖలిస్తాన్ తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తోంది. కెనడాతో పాటు, ఆస్ర్టేలియాలో కూడా హిందూ దేవాలయాలపై దాడులు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వానికి ఇదో హెచ్చరిక లాంటిదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.