Lok Sabha Speaker Om Birla; లోకసభ స్పీకర్ ఓం బిర్లా తీవ్రమనస్తాపం చెందారు. లోకసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల ప్రవర్తనతో ఆయన విసుగు చెందారు. సభను సజావుగా సాగనీయకుండా అడుగడుగునా అడ్డుతగలడంతో ఆయన సభకు రాకుండా ముఖం చాటేశారు. సభ్యుల తీరులో మార్పు వచ్చే వరకు తాను సభలకు హాజరుకాబోనని తన సన్నిహితులకు చెప్పారని తెలిసింది. కాగా బుధవారం లోకసభ ప్రారంభం కాగానే ఆయన స్పీకర్ స్థానంలో లేరు. కాగా పభ యధావిధిగా గందరగోళం మధ్య ప్రారంభమైంది. ప్రతిపక్ష సభ్యుల అరుపులు కేకల మధ్య సభను మధ్యాహ్నం రెండుగంటల వరకు వాయిదా పడింది.
సభ రేపటికి వాయిదా.. (Lok Sabha Speaker Om Birla)
సభ తిరిగి ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యలు మణిపూర్ అంశంపై పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ర్టంలో ప్రస్తుత పరిస్థితిపై ప్రకటన చేయించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. కాగా బీజేపీ సభ్యుడు కిరిటీ సోలంకీ ఓం బిర్లా స్థానంలో స్పీకర్ బాధ్యతలు నిర్వహించారు. సభను సజావుగా నిర్వహించడానికి సహకరించాలని ప్రతిపక్షాలను కోరినా.. పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో ఆయన సభను రేపటికి వాయిదా వేశారు.
అయితే విశ్వసనీయ సమాచారం ప్రకారం ప్రస్తుతం సభ జరుగుతున్న తీరుపై పట్ల ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. మంగళవారం నాడు పలు బిల్లుల ఆమోదం పొందాల్సి ఉండగా అటు అధికారపక్ష సభ్యులు.. ఇటు ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ మనస్తాపం చెందారు. సభ గౌరవాన్ని కాపాడాలని, సభను సజావుగా కొనసాగించడానికి సహకరించాలని కోరినా.. పెద్దగా ప్రయోజనం లేకపోవడంతో …సభ్యుల తీరు మారే వరకు సభలో అడుగుపెట్టనని ఓం బిర్లా నిర్ణయం తీసుకున్నారని ఆయన సన్నిహిత వర్గాలు చెప్పాయి.