Women’s Reservation Bill: మహిళా రిజర్వేషన్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం కోటాను అందించే మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దేశంలోని ఎన్నికల ప్రక్రియలో మహిళలకు సాధికారత కల్పించేందుకు కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇది

  • Written By:
  • Publish Date - September 20, 2023 / 08:21 PM IST

Women’s Reservation Bill: లోక్‌సభ మరియు రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళలకు 33 శాతం కోటాను అందించే మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది. దేశంలోని ఎన్నికల ప్రక్రియలో మహిళలకు సాధికారత కల్పించేందుకు కొత్త పార్లమెంట్ భవనంలో ప్రవేశపెట్టిన తొలి బిల్లు ఇది. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో 454 ఓట్లతో ఆమోదం పొందింది. ఇద్దరు పార్లమెంటు సభ్యులు లోక్‌సభలో తీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు హౌస్ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు. సుమారుగా 8 గంటలపాటు చర్చ జరిగిన అనంతరం బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

 

డీలిమిటేషన్ పూర్తయిన తరువాత.. (Women’s Reservation Bill)

నారీ శక్తి వందన్ అధినియం పేరుతో రూపొందించిన బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది చాలా ముఖ్యమైన బిల్లు అని మరియు సభ్యులను ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరారు. బిల్లుపై చర్చ సందర్భంగా ఎలాంటి సూచనలు వచ్చినా ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు. డీలిమిటేషన్ కసరత్తు చేపట్టిన తర్వాత రిజర్వేషన్ అమలులోకి వస్తుంది . 15 ఏళ్ల పాటు కొనసాగుతుంది.కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కూడా బిల్లుకు మద్దతు పలికారు. అయితే, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు సబ్‌కోటాతో కూడిన బిల్లును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు ఎంఐెఎం ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, ఇంతియాజ్  జలీల్  బిల్లుకు వ్యతిరేకంగా  ఓటు వేసారు.