live-in relationships: సహజీవనాలకు రిజిస్ట్రేషనా? ఎంతటి తెలివి తక్కువ ఆలోచన : సుప్రీం

ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్‌దారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

live-in relationships: దేశంలో సహజీవనం చేసే జంట రిజిస్టర్ చేసుకునేలా రూపకల్పనలు జరగాలంటూ సుప్రీంకోర్టులో ఓ పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

పిటిషన్ పై సుప్రీం ఆగ్రహం

సహజీవన సంబంధాలను (live-in relationships) రిజిస్టర్‌ చేసేలా కేంద్రం నిబంధనలు రూపొందించాలంటూ చేసిన అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం(Supreme Court) కొట్టేసింది. అది తెలివి తక్కువ ఆలోచన అని పిటిషన్‌దారుపై మండిపడింది.

ఈ మధ్య కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ను తన సహజీవన భాగస్వామి ఆఫ్తాబ్‌ పూనావాలా అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాణి అనే మహిళ సుప్రీంకోర్టు లో ఓ పిల్ ను దాఖలు చేశారు. సహజీవన సంబంధాల్లో అత్యాచారాలు, హత్యల వంటి నేరాలు రోజురోజుకి పెరుగుతున్నాయని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి బంధాలను రిజిస్ట్రేషన్‌ చేసేందుకు నిబంధనలు రూపొందించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఇలా రిజిస్ట్రేషన్‌ చేయడం వల్ల సహజీవనంలో ఉండే వ్యక్తుల పూర్తి సమాచారం ప్రభుత్వం వద్ద ఉంటాయని.. అత్యాచార కేసులు కూడా తగ్గుతాయని ఆమె పిటిషన్‌లో పేర్కొన్నారు.

రిజిస్ట్రర్ చేసుకుని ఏంచేసుకుంటారు(live-in relationships)

ఈ పిటిషన్‌పై సోమవారం విచారణ జరిపిన సీజేఐ జస్టిస్‌ డి.వై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్‌దారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌తో సహజీవనం చేసేవారికి భద్రత కల్పించాలని చూస్తున్నారా? లేదా అలాంటి బంధంలోకి ఎవరూ వెళ్లొద్దని కోరుకుంటున్నారా? అని కోర్టు ప్రశ్నించింది. ‘సహజీవన బంధాలను నమోదు చేసుకుని కేంద్రం ఏం చేసుకుంటుంది? ఇది ఎంతటి తెలివి తక్కువ ఆలోచన? ఇలాంటి ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేస్తే జరిమానా విధించాల్సి ఉంటుంది. ఈ పిటిషన్‌ను మేం కొట్టేస్తున్నాం’అని ధర్మాసం స్పష్టం చేసింది.