Raigad Landslides:మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడి మరణించిన వారి సంఖ్య 25 కు చేరింది. ఈ ఘటనలో 86 మంది గ్రామస్తుల జాడ ఇంకా తెలియలేదని అధికారులు తెలిపారు. వీరికోసం గాలింపు జరుగుతోందని అన్నారు.
ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డిఆర్‌ఎఫ్) మరియు ఇతర ప్రభుత్వ ఏజెన్సీల సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ శనివారం ఉదయం మూడవ రోజు తిరిగి ప్రారంభమయిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.భారీ వర్షాల కారణంగా శుక్రవారం సాయంత్రం 6 గంటలకు సెర్చ్ ఆపరేషన్‌ను నిలిపివేసినట్లు ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారి తెలిపారు. నాలుగు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు మరియు ఇతర ఏజెన్సీలు ఈ ఉదయం ఆపరేషన్‌ను తిరిగి ప్రారంభించాయని తెలిపారు. కొండ వాలుపై ఉన్న గ్రామంలోని 48 ఇళ్లలో 17 ఇళ్లు కొండచరియలు విరిగిపడి ధ్వంసమయ్యాయి. గ్రామానికి పక్కా రోడ్డు లేకపోవడంతో మూవర్లు, ఎక్స్‌కవేటర్‌లను సులభంగా తరలించలేమని, రెస్క్యూ ఆపరేషన్ మాన్యువల్‌గా జరుగుతోందని అధికారులు తెలిపారు.
ప్రాణాలతో బయటపడిన వారి కోసం 60 కంటైనర్‌లను ట్రాన్సిట్ క్యాంపులుగా ఉపయోగించాలని అభ్యర్థించారు. వాటిలో 40 ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయని కొంకణ్ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిసిటీ కార్యాలయం శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. 20 తాత్కాలిక మరుగుదొడ్లు మరియు సమాన సంఖ్యలో స్నానపు గదులు సిద్ధం చేయబడ్డాయి.
రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల్లోని నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే శుక్రవారం రాష్ట్ర శాసనసభకు తెలిపారు. ప్రస్తుతం ప్రమాదం జరిగిన ఇర్షాల్‌వాడి కుగ్రామం కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్న ప్రాంతాల జాబితాలో లేదని తెలిపారు.