Rajiv Chandrasekhar:కేరళలో ఆదివారంనాడు జరిగిన వరుస పేలుళ్ల ఘటనపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేరళ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక విద్వేష వ్యాప్తికి, ఇరు వర్గాల మధ్య శతృత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై ఆయనపై కేసు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ మీడియా సెల్ కన్వీసర్ సరిన్ పి ఈ ఫిర్యాదు చేశారు. సెక్షన్ 153 (ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం) కింద ఎర్నాకుళం సెంట్రల్ పోలీస్ స్టేషన్‌లో కేంద్ర మంత్రిపై రెండు ఎఫ్ఐఆర్‌లు దాఖలు చేశారు.
క్రైస్తవ ప్రార్థనా సమావేశంలో పేలుళ్లు చోటుచేసుకోగానే ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై చంద్రశేఖర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతున్నారంటూ తప్పుపట్టారు.అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిన సీఎం పినరయి విజయన్ బుజ్జగింపు రాజకీయాలకు పాల్పడుతుండటం సిగ్గుచేటు. కేరళలో బాంబు పేలుళ్లతో జనం అల్లాడుతుంటే ఢిల్లీలో కూర్చుని ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలపడంతో ఆయన బిజీగా ఉన్నారు అంటూ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. హమాస్ వంటి హింసాత్మక సంస్థలకు నిర్లజ్జగా మద్దతిస్తున్నారని, సీఎం హయాంలో ర్యాడికల్ సంస్థలకు మద్దతు పెరిగిందని ఆరోపించారు. దశాబ్దాలుగా కేరళలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు బుజ్జగింపు రాజకీయల చరిత్ర చాలా ఉందన్నారు. ఇందువల్ల ఎంతో మంది అమాయక ప్రజలు, భద్రతా సిబ్బంది బలయ్యారని విమర్శించారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్.
కాగా, కేరళలోని కన్వెన్షన్ సెంటర్‌లో ఆదివారంనాడు కేవలం నిమిషాల వ్యవధిలోనే మూడు పేలుళ్ల జరగడం ఇద్దరు మహిళలు, 12 ఏళ్ల బాలిక దుర్మరణం పాలయ్యారు. 50 మంది వరకూ గాయపడ్డారు. ఈ ఘటన జరిగిన గంటల్లోనే ఈ పేలుళ్లకు బాధ్యత వహిస్తూ 48 ఏళ్ల వ్యక్తి ఒకరు పోలీసులకు లొంగిపోయిన విషయం తెలిసిందే.