Bibhav Kumar స్వాతి మలీవాల్‌పై జరిగిన దాడి కేసు పలు మలుపులు తిరుగుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతిమలీవాల్ కేజ్రీవాల్‌ను పరామర్శించడానికి ఆయన ఇంటికి వెళ్లినప్పుడు కేజ్రీవాల్ పర్సెనల్ సెక్రటరీ తనపై దాడి చేశాడని ఆమె పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు భైబవ్‌కుమార్‌ను అరెస్టు చేశారు. శనివారం నాడు ఆయనను తీస్ హాజారీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. ఎఫ్‌ఐఆర్‌లో కుమార్ తనను ఏడెనిది సార్లు చెంపపై కొట్టాడని.. చాతీపై తన్నాడని.. కడుపులో తన్నడంతో పాటు తనను చంపేస్తానని బెదిరించాడని ఫిర్యాదు చేశారు.
ఇక తాజాగా కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బైబవ్‌కుమార్ శుక్రవారం నాడు స్వాతి మలీవాల్‌కు వ్యతిరేకంగా కౌంటర్ ఫిర్యాదు చేశాడు. తన ఫిర్యాదులో స్వాతి ఎలాంటి ముందుస్తు అనుమతి తీసుకోకుండా బలవంతంగా సీఎం ఇంట్లో ప్రవేశించడానికి ప్రయత్నించారని, తాను ఆపినా ఆగకుండా తనపై దుర్భాషలాడిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బైబవ్ .. స్వాతి తనను కేసులో ఇరికించాలని చూస్తోందని ఆరోపించాడు. ఈనెల 13న బలవంతంగా సీఎం ఇంట్లోకి ప్రవేశించిందని.. అడ్డుకున్న తనను నువ్వెంత నీ అర్హత ఎంత ఎంపీని నన్నే ఆపే దమ్ము ఉందా అంటూ పరుషపదజాలంతో తనను దుర్భాషలాడిందని చెప్పారు. నేనేంటో నా తడాఖా చూపిస్తానని చెప్పారని.. తనను తప్పుడు కేసులో ఇరికించి జీవితాంతం జైల్లో కుళ్లిపోయేలా చేస్తానని హెచ్చరించారు. తనను బెదిరించారని పోలీసులకు చేసిన ఫిర్యాదులో బైబవ్‌కుమార్ పేర్కొన్నాడు. కాగా కుమార్ ఫిర్యాదు కాపీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు (నార్త్)కు కూడా పంపాడు.
స్వాతి మలీవాల్‌కు వ్యతిరకంగా కఠిన చర్యల తీసుకోవాలని పోలీసులను కోరాడు కుమార్. ప్రస్తుతం లోకసభ ఎన్నికలు జరుగుతున్న క్రమంలో కావాలనే ఆప్ పార్టీ విజయాన్ని గండికొట్టాలని… బీజేపీ చేతిలో కీలుబొమ్మ అయ్యారని ఆరోపించారు. ఆమె కాల్‌రికార్డ్స్, చాట్‌లు, బీజేపీ నాయకులను ఎప్పుడెప్పుడు కలిసిన విషయాలపై కూడా ఆరా తీయాలని పోలీసులను కోరారు. ఇదిలా ఉండగా శుక్రవారం సాయంత్రం 4.40 గంటలకు పోరెన్సిక్ సైన్స్ లేబరెటీ టీం ముఖ్యమంత్రి ఇంటికి వచ్చి దర్యాప్తు మొదలుపెట్టారు. కాగా దర్యాప్తు సందర్భంగా ఢిల్లీ పోలీసు అధికారులు కూడా ఎఫ్ఎస్‌ఎల్ టీం వెంట వచ్చారు. సాయంత్రం 5.15 గంటలకు వెళ్లిపోయారు. సుమారు గంటపాటు భారీయంత్రాలతో సీఎం ఇంటికి వచ్చారు. ఇదిలా ఉండగా 6.23 గంటలకు ఢిల్లీ పోలీసులు ముఖ్యమంత్రి నివాసానికి స్వాతి మలీవాల్‌ను కూడా వెంట తీసుకువచ్చారు. సుమారు 40 నిమిషాల పాటు ఆమె అక్కడ ఉండి తర్వాత తిరిగి వెళ్లిపోయారు.
ఇదిలా ఉండగా శుక్రవారం నాడు మలీవాల్ ఓ ట్విట్‌లో ఆప్ పార్టీ యూ టర్న్ తీసుకుందన్నారు. రెండు రోజుల క్రితం కుమార్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆప్ పార్టీ పేర్కొంది. తీరా రెండు రోజులు గడిచే సరికి ఆప్ నాయకురాలు అతిషి కూడా మలీవాల్‌పై విరుచుకుపడుతున్నారు. మలీవాల్‌పై ప్రస్తుతం యాంటీ కరప్షన్ బ్యూరో కేసును విచారిస్తోందని ఆరోపించారు.