police Officials Suspended: బెంగళూరు తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఆర్సీబీ జట్టు విజయోత్సవాల్లో జరిగిన ఘటనతో అధికారులపై చర్యలు తీసుకుంది. పలువురు పోలీస్ ఉన్నతాధికారులను సస్పెండ్ చేసింది. తొక్కిసలాట జరిగి 11 మంది మరణించగా, మరో 47 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై నిర్లక్ష్యం వహించిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
కాగా సస్పెండ్ అయిన వారిలో బెంగళూరు నగర పోలీసు కమిషనర్ బి. దయానంద్ తో పాటు మరో నలుగురు అధికారులు ఉన్నారు. వారిలో అదనపు పోలీస్ కమిషనర్ వికాస్ కుమార్, సెంట్రల్ డిసిపి టి. శేఖర్, కబ్బన్ పార్క్ ఏసీపీ బాలకృష్ణ, కబ్బన్ పార్క్ పోలీస్ ఇన్ స్పెక్టర్ గిరీష్ ఉన్నారు. అలాగే చిన్నస్వామి స్టేడియం ఇంఛార్జ్ ని విధుల నుంచి తప్పించింది. ఆర్సీబీ ప్రతినిధులు, ఈవెంట్ మేనేజర్లు, కేఎస్సీఏ సభ్యులను అరెస్ట్ చేయాలని సీఎం సిద్ధరామయ్య.. డీజీపీ, ఐజీపీని ఆదేశించారు. విషాద ఘటనపై సీఐడీ విచారణకు, న్యాయవిచారణకు ఆదేశాలిచ్చారు. ఘటన జరిగిన విధానం, భద్రతా ఏర్పాట్లలో వైఫల్యం, ఆదేశాల అమలులో నిర్లక్ష్యం వంటి అంశాలపై విచారణ జరగనుంది.