Karnataka CM Siddaramaiah:కర్ణాటక సీఎం సిద్దరామయ్య తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘జీరో ట్రాఫిక్’ విధానాన్ని రద్దు చేయాలని ఆయన ఆదివారం బెంగళూరు పోలీసులకు చెప్పారు. ఈ ప్రోటోకాల్ అమలులో ఉన్న మార్గంలో ప్రయాణించే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలించిన తర్వాత తాను ఈ చర్య తీసుకున్నట్లు సిద్దరామయ్య చెప్పారు.
దీనికి సంబంధించి ట్విటర్‌లో సిద్ధరామయ్య ఇలా వ్రాశారు. నా వాహనాల కదలిక కోసం ‘జీరో ట్రాఫిక్’ ప్రోటోకాల్‌ను వెనక్కి తీసుకోవాలని బెంగళూరు నగర పోలీసు కమిషనర్‌ను కోరాను. ఆంక్షలు ఉన్న ప్రాంతంలో ప్రయాణించే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను చూసిన తర్వాత నేను ఈ నిర్ణయం తీసుకున్నానని అన్నారు. సీఎంగా సిద్దరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్ మరో 8 మంది మంత్రులు శనివారం ప్రమాణస్వీకారం చేసారు.
సాధారణంగా ముఖ్యమంత్రులు, మంత్రులు ప్రయాణించే మార్గాల్లో ఇబ్బందులను నివారించడానికి గాను ట్రాఫిక్ ను నియంత్రిస్తారు. సదరు మార్గంలో ప్రయాణించే వాహనాలను నిలిపివేయడం, దారి మళ్లించడం చేస్తారు. దీనిని జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్ అంటారు. గతంలో కర్ణాటక మాజీ సీఎం బసవరాజ్ బొమ్మై, కర్ణాటక మాజీ హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర కూడా జీరో ట్రాఫిక్ ప్రోటోకాల్‌ను తిరస్కరించారు.