Kallakkadal warning in Kerala, Tamil Nadu: బిగ్ అలర్ట్. కేరళ, తమిళనాడు తీర ప్రాంతాలకు కల్లక్కడల్ ముప్పు పొంచి ఉందని ఐఎన్‌సీఓఐఎస్ కేంద్ర సంస్థ హెచ్చరించింది. హిందూ మహా సముద్రంలో బలమైన గాలుల కారణంగా బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో అలలు ఎగిసిపడనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఈ అలలే దాదాపు 1 మీటర్ వరకు ఎగిసిపడతాయని ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓసిాయన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ తెలిపింది.
రెండు రాష్ట్రాలకు సముద్ర ఉప్పెన ముప్పు ఉన్నందున మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఐఎన్‌సీఓఐఎస్ సూచించింది. దీంతో రెండు రాష్ట్రాల అధికారులు చర్యలు చేపట్టారు. తీర ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, పర్యటకులు సైతం బీచ్‌కు వెళ్లొద్దని సూచించింది.
ఇదిలా ఉండగా, ఐఎన్‌సీఓఐఎస్ ఇచ్చిన సమాచారం మేరకు కేరళ విపత్తు ప్రతిస్పందన నిర్వహణ సంస్థ కేఎస్‌డీఎంఏ ముందస్తు చర్యలు చేపట్టింది. తీర ప్రాంతాలపై అడిషనల్ నిఘా పెంచాలని అధికారులకు సూచించింది. కాగా, ఈ కల్లక్కడల్.. సముద్రంలో సడెన్‌గా వచ్చే మార్పుగా పేర్కొంది. ఇలా రావడంతో సముద్రం ఉప్పొంగడానికి కారణమని వెల్లడించింది.