JMM MP Mahua Maji injured while returning from Maha Kumbh: ఝార్ఖండ్ రాజ్యసభ ఎంపీ మహువా మాజీ ప్రమాదానికి గురయ్యారు. కుంభమేళా నుంచి తిరిగొస్తుండగా బుధవారం తెల్లవారుజామున ఎంపీ మహువా మాజీకి చెందిన కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
ఝార్ఖండ్ రాజ్యసభ ఎంపీ మహువా మాజీ కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. ఆమె కుమారుడు, కోడలితో కలిసి కారులో తిరిగివస్తుండగా.. ఝార్ఖండ్‌లోని లతేహార్ సమీపంలో ఆగి ఉన్న ఓ ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీతో పాటు పాటు కుటుంబ సభ్యులకు సైతం గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.
అయితే ఎంపీ చేతికి ఫ్రాక్చర్ అయిందని, మెరుగైన చికిత్స కోసం రాంచీలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఎవరూ ఆందోళన పడాల్సిన పరిస్థితి లేదని, ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.