Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో గురువారం ఉగ్రవాదులు రెండు ఆర్మీ వాహనాలపై మెరుపుదాడి చేయడంతో ముగ్గురు జవాన్లు మరణించగా పలువురు గాయపడ్డారు. థానమండి-సురన్‌కోట్ రహదారిలోని సావ్ని ప్రాంతంలో వాహనాలపై దాడి జరిగింది. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ జరుగుతున్న బఫ్లియాజ్ ప్రాంతం నుండి జవాన్లను తీసుకువెడుతుంగా ఈ దాడి జరిగింది.
బుధవారం జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో సాయుధ పోలీసు యూనిట్ కాంపౌండ్‌లో పేలుడు సంభవించిన తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది.ఉగ్రవాదులు దాడి చేసిన వెంటనే సైనికులు కూడా ప్రతీకారం తీర్చుకున్నారని ఆర్మీ అధికారులు తెలిపారు. దళాలు సాయంత్రం నుండి ఆ ప్రాంతంలో కొనసాగుతున్న ఉగ్రవాదులపై జాయింట్ ఆపరేషన్‌ను బలోపేతం చేయబోతున్నాయి. 48 రాష్ట్రీయ రైఫిల్స్ ప్రాంతంలో కార్యకలాపాలు జరుగుతున్నాయి అని వారు తెలిపారు.ఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించారు.ఘటన జరిగిన ప్రదేశం దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో అక్కడ ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు మోహరించారు. ఘటక్ క్యూఆర్‌టి మరియు ప్రత్యేక బలగాలను ఆపరేషన్ కోసం పిలిపించారు. ఉగ్రవాదుల వైపు నుంచి కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి.