Jammu and Kashmir Encounter:జమ్ముకశ్మీర్ ఎన్ కౌంటర్లో మరణించిన కల్నల్ మన్‌ప్రీత్‌సింగ్ భౌతికకాయం స్వగ్రామం పంజాబ్‌లోని మల్లాన్‌పూర్‌కు చేరింది. మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యులను ఆపడం ఎవరితరం కాలేదు. గుండెలు పగిలేలా ఏడుస్తున్న కుటుంబ సభ్యుల రోదనలు చూసి గ్రామస్థులంతా కన్నీరు పెట్టుకున్నారు.
జై హింద్ నాన్న అంటూ..(Jammu and Kashmir Encounter)
మన్‌ప్రీత్ ఆరేళ్ల కుమారుడు ఆర్మీ దుస్తులు ధరించి జై హింద్ నాన్న అంటూ చివరిసారి సెల్యూట్ చేశాడు. మన్‌ప్రీత్ రెండేళ్ల కూతురు కూడా అన్నను అనుకరించింది. రెండు పసి హృదయాల అమాయకపు సెల్యూట్‌లు గుండె బరువెక్కేలా చేశాయి. అక్కడ ఏం జరుగుతుందో కూడా సరిగా తెలియని ఆ సైనికుని ఇద్దరు పిల్లలు జై హింద్ అంటూ కడసారి వీడ్కోలు పలికారు. కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ భార్య, సోదరి, తల్లి, ఇతర కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
కల్నల్ మన్‌ప్రీత్ సింగ్ 19 రాష్ట్రీయ రైఫిల్స్ కమాండింగ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవేట కొనసాగుతుండగా.. అనంతనాగ్ జిల్లాలో బుధవారం ఎదురుకాల్పులు జరిగాయి. ఇందులో మన్‌ప్రీత్ ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉండగా.. మన్‌ప్రీత్‌తో పాటు మేజర్ ఆశిష్ ధోంచక్, జమ్మూ కశ్మీర్ డిప్యూటీ సూపరింటెండెంట్ హుమయూన్ వీరమరణం పొందారు. మేజర్ ఆశిష్ ధోంచక్ మృతహానికి కూడా పానిపట్‌లోని స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న 33 ఏళ్ల హిమాయున్ ముజామిల్ భట్ అంత్యక్రియలకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, పోలీసు చీఫ్ దిల్బాగ్ సింగ్ నివాళులర్పించారు.