Site icon Prime9

Pahalgam Terror Attack: కేంద్ర కీలక నిర్ణయం.. పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్థాన్ దౌత్యవేత్తకు సమన్లు జారీ!

Pahalgam Attack

Pahalgam Attack

India has intensified diplomatic measures against Pakistan: జమ్మూకశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌పై భారత్ దౌత్యపరమైన చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ఇండియాలోకి పాకిస్థానీయులకు ప్రవేశంపై నిషేధం విధించింది. సింధూ నది జలాల ఒప్పందాన్ని కూడా కేంద్రం నిలిపివేసింది. తాజాగా ఢిల్లీలోని పాక్‌ దౌత్యవేత్తకు సమన్లు జారీచేసింది. బుధవారం అర్ధరాత్రి అనంతరం పాక్ దౌత్యవేత్త సాద్‌ అహ్మద్‌ వరైచ్‌ను పిలిచి ఆ దేశ మిలిటరీ దౌత్యవేత్తలకు పర్సోనా నాన్‌ గ్రాటా నోటీసులు అందించింది. అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనేందుకు నోటీసులు జారీచేస్తారు. దీని ప్రకారం వారం రోజుల్లోగా ఇండియాను వీడాల్సి ఉంటుందని విదేశాంగశాఖ వర్గాలు వెల్లడించాయి.

 

ఉగ్రవాదుల ఫొటోలు, ఊహాచిత్రాలు విడుదల..
పహల్గాంలో రెండు రోజుల క్రితం పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులకు సంబంధించిన ఫొటోలు, ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి. ఉగ్రవాదుల దాడిలో 28 మంది పర్యాటకులు మృతిచెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం దాడిలో పాల్గొన్న ఉగ్రవాదులను గుర్తించారు. ఆసిఫ్‌ ఫుజీ, సులేమాన్‌ షా, అబూతల్హాగా దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. వీరు నిషిద్ధ ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తాయిబా అనుబంధ గ్రూపు రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ సభ్యులుగా తెలుస్తున్నది.

 

సింధూ జలాల ఒప్పందం నిలిపివేత..
జమ్మూకశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై దౌత్యపరమైన చర్యలను కేంద్రం బుధవారం ప్రారంభించింది. సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయడం, పాక్ జాతీయులకు ఇండియాలో ప్రవేశంపై నిషేధం విధించడం వంటి 5 అంశాలతో కూడిన చర్యలను ఇండియా ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం భద్రతా వ్యవహారాలకు సంబంధించిన కేబినెట్ కమిటీతో సమావేశం నిర్వహించి, పహల్గాం ఉగ్రదాడి ఘటనపై సమీక్షించారు. సమావేశం అనంతరం కేంద్రం పాక్‌పై చేపట్టిన ఐదు చర్యలను ప్రకటించింది.

 

పాక్‌ నుంచి ప్రకటన వెలువడే వరకు..
1960లో పాకిస్థాన్‌తో భారత్ కుదుర్చుకున్న సింధూ నదీ జలాల ఒప్పందాన్ని వెంటనే నిలిపివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. సీమాంతర ఉగ్రవాదానికి అంతం చేస్తున్న మద్దతును నిలిపివేస్తున్నట్లు పాక్‌ నుంచి స్పష్టమైన ప్రకటన వెలువడే వరకు నదీ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టును వెంటనే మూసివేస్తున్నట్లు తెలిపింది. చట్టబద్ధమైన పత్రాలతో ఇండియాలోకి ప్రవేశించిన పాక్ పౌరులు వచ్చే నెల 1వ తేదీలోగా ఈ మార్గంలో తిరిగి వెళ్లిపోవచ్చని కేంద్రం ప్రకటించింది.

 

సార్క్‌ వీసా మినహాయింపు..
సార్క్‌ వీసా మినహాయింపు పథకం కింద పాక్ జాతీయులు ఇండియాలో ప్రయాణించడానికి అనుమతించమని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. పథకం కింద గతంలో పాక్ జాతీయులకు జారీ చేసిన వీసాలు రద్దు అయినట్లేనని స్పష్టం చేసింది. పథకం కింద వీసా తీసుకుని ప్రస్తుతం ఇండియాలో ఉన్న పాక్ జాతీయులు 48 గంటల్లో వీడాలని కేంద్రం ఆదేశించింది. ఇస్లామాబాద్‌లోని ఇండియా హై కమిషన్‌ నుంచి తన రక్షణ, నౌకాదళ, వైమానిక సలహాదారులను ఉపసంహరిస్తున్నట్లు భారత్‌ ప్రకటించింది. ఢిల్లీలోని పాక్ హై కమిషన్‌లో ఉన్న ఆ దేశ సైనిక, నౌకాదళ, వైమానిక సలహాదారులు వారం రోజుల్లో ఇండియాను వీడాలని కేంద్రం ఆదేశించింది. భారత్‌లోని పాక్ హై కమిషన్లలోని దౌత్యాధికారుల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 55 నుంచి 30కు తగ్గించాలని పాకిస్థాన్‌ను ఆదేశించినట్లు భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ తెలిపారు.

Exit mobile version
Skip to toolbar