New Rules in IRCTC Tatkal Ticket Booking in Future: ఐఆర్‌సీటీసీ మరో ముందడుగు వేయనుంది. తత్కాల్ టికెట్ల బుకింగ్ విషయంలో కీలక నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. త్వరలోనే ఈ – ఆధార్ అథంటికేషన్ తీసుకొస్తున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. ఈ విధానం అందుబాటులోకి వస్తే కేవలం ఆధార్ ధృవీకరించిన అకౌంట్స్ నుంచి మాత్రమే ఆన్‌లైన్‌లో తత్కాల్ టికెట్లు బుక్ చేసేందుకు అవకాశం ఉంటుంది.
అంతేకాకుండా తత్కాల్ టికెట్ బుకింగ్ కోసం ఆధార్ ఆధారిత ఓటీపీ వెరిఫికేషన్ అవసరం ఉంటుంది. అలాగే కౌంటర్ నుంచి తత్కాల్ టికెట్స్ తీసుకునేందుకు సైతం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి ఉండవచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ప్రయాణికుల భద్రత, బుకింగ్ ప్రక్రియ వేగవంతం, మోసాలను అరికట్టడంతోపాటు సులభతరం చేయాలనే లక్ష్యంతో ఈ విధానం తీసుకొచ్చే ఆలోచనలో ఉందని తెలిపాయి.
ఇదిలా ఉండగా, దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 2.25 లక్షలమంది రైళ్లల్లో ప్రయాణించేందుకు ఆన్‌లైన్‌లో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇందులో చాలా మంది ఇప్పటికీ ఆధార్ నంబర్‌తో వెరిఫికేషన్ చేయడం లేదు. ఈ నేపథ్యంలో త్వరలో ఆధార్‌తో వెరిఫై చేయని అకౌంట్లను క్లోజ్ చేయవచ్చని ఐఆర్‌సీటీసీ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటివరకు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో 130 మిలియన్స్ యూజర్లు యాక్టివ్‌గా ఉన్నారు. కాగా, నేటికీ దాదాపు 1.2 కోట్ల ఖాతాలు మాత్రమే ఆధార్ నంబరుతో వెరిఫికేషన్ అయినట్లు ఐఆర్‌సీటీసీ పేర్కొంది.
ఐఆర్‌సీటీసీ దాదాపు 20 లక్షల ఖాతాలను అనుమానాస్పదంగా గుర్తించింది. ప్రస్తుతం ఈ ఖాతాలపై విచారణ నిర్వహిస్తుంది. ఇందులోనుంచి నిజమైన ప్రయాణికులకు మాత్రమే తత్కాల్ టికెట్లు అందించే లక్ష్యంగా ఐఆర్‌సీటీసీ అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగానే ఆధార్ వెరిఫికేషన్ అకౌంట్లపై ఐఆర్‌సీటీసీ దర్యాప్తు చేసి అనుమాన్సద అకౌంట్లను మూసివేయాలనే యోచనలో ఉంది. ఇక, తత్కాల్ టికెట్లు బుకింగ్ చేసిన 10 నిమిషాల్లోనే ఆధార్ వెరిఫికేషన్ అకౌంట్లకు ప్రాధాన్యత ఇవ్వనుంది. దీంతో ఈ సమయంలో ఐఆర్‌సీటీసీ ఏజెంట్లు సైతం టికెట్లు బుక్ చేసుకునేందుకు వీలు ఉండదు.