Site icon Prime9

Global Hunger Index: గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో ఇండియా కు 111 ర్యాంకు.. తప్పు బట్టిన భారత ప్రభుత్వం..

Global Hunger Index

Global Hunger Index

Global Hunger Index: గ్లోబల్‌ హంగర్‌ ఇండెక్స్‌లో 2023లో మొత్తం 125 దేశాలకు గాను ఇండియా 111 ర్యాంకులో నిలిచింది. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ నివేదకను తప్పుబడుతోంది. ఏ గణాంకాల ప్రకారం ఈ నివేదికను తయారు చేశారని ప్రశ్నించింది. ప్రపంచ ఆహార సూచీ–2023లో భారత్‌ 111వ స్థానంలో నిలిచింది. గురువారం విడుదల చేసిన ఈ సూచీలో మొత్తం 125 దేశాల్లో మనకు ఈ ర్యాంకు దక్కింది.

తప్పుడు ర్యాంకింగ్..(Global Hunger Index)

అయితే దీన్ని లోపభూయిష్టమైనదిగా కేంద్రం కొట్టిపారేసింది. ఇది తప్పుడు ర్యాంకింగ్‌. దురుద్దేశపూర్వకంగా ఇచ్చినది అంటూ మండిపడింది. అన్ని రకాలుగా పీకల్లోతు సంక్షోభంలో మునిగిన పాకిస్తాన్‌ (102), అంతే సంక్షోభంలో ఉన్న శ్రీలంక (60)తో పాటు బంగ్లాదేశ్‌ (81), నేపాల్‌ (61) మనకంటే చాలా మెరుగైన ర్యాంకుల్లో ఉండటం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. 28.7 స్కోరుతో ఆకలి విషయంలో భారత్‌లో పరిస్థితి ఆందోళనకరంగా ఉందని నివేదిక చెప్పుకొచ్చింది. 27 స్కోరుతో దక్షిణాసియా, సహారాకు దక్షిణాన ఉన్న ఆఫ్రికా ప్రాంతాలు ఆకలి సూచీలో టాప్‌లో ఉన్నట్టు పేర్కొంది. ‘ ఇండియా బాలల్లో పౌష్టికాహార లోపం తీవ్రంగా 18.7గా ఉంది. ఐదేళ్లలోపు పిల్లల్లో మరణాల రేటు 3.1 శాతం, 15–24 ఏళ్ల లోపు మహిళల్లో రక్తహీనత ఉన్నవారి సంఖ్య ఏకంగా 58.1 శాతం ఉన్నాయి‘ నివేదికలో వివరించింది.

వాతావరణంలో మార్పులు, కల్లోలాలు, మహమ్మారులు, రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం వంటివి ఆకలి సమస్యను ఎదుర్కోవడంలో అవరోధాలుగా నిలిచాయని సర్వే పేర్కొంది. ఇదంతా అభూత కల్పన అంటూ కేంద్రం మండిపడింది. ‘ఇది తప్పుడు గణాంకాల ప్రకారం రూపొందించిన సూచీ. కేవలం 3,000 మందిపై నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ ఆధారంగా పౌష్టికాహార లోపం శాతాన్ని నిర్ధారించడం క్షమార్హం కాని విషయం. దాంతో బాలల్లో వాస్తవంగా కేవలం 7.2 శాతమున్న పౌష్టికాహార లోపాన్ని ఏకంగా 18.7గా చిత్రించింది. దీని వెనక దురుద్దేశాలు ఉన్నాయన్నది సుస్పష్టం అంటూ కేంద్ర ప్రభుత్వం మండిపడింది.

Exit mobile version