Canada Diplomat: కెనడా కేంద్రంగా రోజురోజుకీ విస్తరిస్తున్న ఖలిస్థాన్ భావన దౌత్యపరమైన ఉద్రిక్తతలని రెచ్చగొడుతోంది. కెనడా.. భారత దేశాలు దౌత్యవేత్తలని బహిష్కరించడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలోనే కెనడాలోని భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు పడింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయంలోని రీసెర్చి అండ్ ఎనాలసిస్ వింగ్ అధిపతిని దేశం విడిచి వెళ్ళాలని ఆ దేశ ప్రభుత్వం ఆదేశించింది. దీనికి ప్రతిగా ఇవాళ కెనడా హైకమిషన్ కార్యాలయంలో పని చేస్తున్న ఓ సీనియర్ దౌత్యవేత్తని ఐదు రోజుల్లో దేశం విడిచి వెళ్ళాలని మోదీ సర్కార్ ఆదేశించింది. మన దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నారని కెనడా హైకమిషనర్‌ని పిలిపించిన మన విదేశాంగ శాఖ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.
కెనడా ప్రధాని ఆరోపణ..( Canada Diplomat)
ఈ ఏడాది జూన్‌లో ఖలిస్థానీ సానుభూతిపరుడు, ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ఏజెంట్ల పాత్ర ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించారు. బ్రిటిష్ కొలంబియాలోని సర్రే ప్రాంతంలో ఓ గురుద్వారా సాహిబ్ ప్రాంగణంలో గుర్తుతెలియని వ్యక్తులు నిజ్జర్‌ని కాల్చి చంపారు. భారత్‌లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న నిజ్జర్ తలపై రూ.10లక్షల రివార్డు ఉంది.ట్రూడో ఆరోపణల నేపథ్యంలోనే ఈ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేసిన కెనడా.. భారత దౌత్యవేత్తపై బహిష్కరణ వేటు వేసింది. కెనడాలోని భారత దౌత్యకార్యాలయానికి చెందిన ఇంటెలిజెన్స్ విభాగం అధిపతి పవన్ కుమార్ రాయ్‌ను బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రి మెలనీ జాలీ ప్రకటించారు.
అయితే కెనడా ఆరోపణలని భారత విదేశాంగ శాఖ ఖండించింది. కెనడాలో ఆశ్రయం పొందుతూ, భారత సార్వభౌమత్వానికి ముప్పుగా మారిన ఖలిస్థానీ ఉగ్రవాదులు, అతివాదుల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని విదేశాంగ శాఖ చెబుతోంది. గతంలో ప్రధాని మోదీ వద్ద కూడా కెనడా ప్రధాని ఇలాంటి ఆరోపణలే చేశారని, సుదీర్ఘంగా నెలకొన్న ఈ ఖలిస్థానీ వివాదంపై భారత్ చేసిన డిమాండ్లపై కెనడా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆందోళనకరమని భారత విదేశాంగ శాఖ అంటోంది.