Kharif Crops Price: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో రైతుల కోసం కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచారు. వరి క్వింటాలుకు 143 రూపాయల చొప్పున, మూంగ్ దాల్ ( పెసర పప్పు ) క్వింటాలుకు 803 చొప్పున, రాగులు క్వింటాలుకు 268 చొప్పున పెంచారు. మంత్రివర్గ సమావేశం వివరాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వివరించారు.
2023-24 మార్కెటింగ్ సీజన్ కోసం ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచినట్లు తెలిపారు. పంటల మార్పిడిని ప్రోత్సహించేందుకు, రైతులకు సరసమైన ధర లభించేలా చూడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఎంఎస్‌పీని రికార్డు స్థాయిలో పెంచినట్లు తెలిపారు. వరికి కనీస మద్దతు ధరను క్వింటాలుకు 2,040 నుంచి 2,183కు పెంచినట్లు తెలిపారు. మూంగ్ దాల్ ఎంఎస్‌పీని క్వింటాలుకు 7వేల 755 నుంచి 8వేల 558కి పెంచారు. మణిపూర్ హింసాకాండ, బాలాసోర్ రైలు దుర్ఘటనలలో ప్రాణాలు కోల్పోయినవారికి మంత్రివర్గం సంతాపం తెలిపిందని గోయల్ పేర్కొన్నారు.
పంటలకు పెంచిన మద్దతు ధరలు .. ( Kharif Crops Price)
కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన ఎంఎస్‌పీ ధరలు ఇలా ఉన్నాయి. సాధారణ వరి క్వింటాలుకు కనీస మద్దతు ధర 2022-23లో 2,040 రూపాయలుగా ఉండేది. దీనిని 2023-24 ఆర్థిక సంవత్సరం కోసం 2,183కు పెంచారు. మొత్తానికి సాధారణ వరిపై క్వింటాలక 143 రూపాయలు పెంచారు. ఇక గ్రేడ్ ఏ వరి క్వింటాలుకు ఎంఎస్‌పీని 2,060 నుంచి 143 రూపాయలు పెంచి, 2,203 రూపాయలకు సవరించారు. హైబ్రిడ్ జొన్నలు క్వింటాలుకు ఎంఎస్‌పీని 2,970 నుంచి 210 పెంచి, 3,180కి సవరించారు. ఇక రాగులు క్వింటాలుకు 3,578 నుంచి 3,846కు పెంచారు.. రాగులపై 268 పెరిగింది. వేరుశనగలు (పల్లీలు) క్వింటాలుకు 527 పెంచారు. దీనితో క్వింటాలు ధర 6,377 చేరుతుంది. ప్రస్తుతం పల్లీలు క్వింటాలు మద్దతు ధర 5,850 గా ఉంది.
రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ప్రభుత్వం సేకరించే ధరను కనీస మద్దతు ధర అంటారు. ఖరీఫ్, రబీ సీజన్లలో పండే 23 పంటలకు ఎంఎస్‌పీని ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఖరీఫ్ (యాసంగి) పంటలను కోసిన తర్వాత అక్టోబరు నుంచి రబీ (శీతాకాలం) పంట కాలం ప్రారంభమవుతుంది. గోధుమలు, ఆవాలు ప్రధాన రబీ పంటలు.