Mass Marriages: మహారాష్ట్రలో సామూహిక వివాహాలు చేసుకునే జంటలకు అందించే ఆర్థిక సహాయాన్ని రూ.10,000 నుంచి రూ.25,000కు పెంచనున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తెలిపారు.పాల్ఘర్ జిల్లాలో జరిగిన సామూహిక వివాహ కార్యక్రమంలో షిండే ఈ ప్రకటన చేసారు.
ఇక్కడ సామూహిక వివాహ కార్యక్రమంలో 325 జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యాయి. ఈ సందర్బంగా షిండే మాట్లాడుతూ ఆడంబరంగా పెళ్లిళ్లు చేసుకునే అవకాశం లేని కారణంగా సామూహిక వివాహాలు జరగాల్సిన అవసరం ఉందన్నారు.సామూహిక వివాహాల సందర్భంగా అర్హులైన జంటలకు అందజేస్తున్న ఆర్థికసాయాన్ని ప్రస్తుతం రూ.10వేలు నుంచి రూ.25వేలకు ప్రభుత్వం పెంచుతుందని, సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు.
ఈ ప్రాంతంలో 150 పడకల ఈఎస్‌ఐఎస్ ఆసుపత్రి రాబోతోందని, ఇది కార్మిక వర్గానికి ఉపయోగపడుతుందని షిండే అన్నారు.ముంబయి మెట్రోపాలిటన్ రీజినల్ డెవలప్‌మెంట్ అథారిటీ (MMRDA) పాల్ఘర్‌ను అభివృద్ధి చేయడానికి వివిధ ప్రాజెక్టులను చేపడుతుందని ఆయన చెప్పారు.బోయిసర్‌లోని తారాపూర్ పారిశ్రామిక ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశమై ఈ ప్రాంతంలోని పరిశ్రమలకు సంబంధించిన సమస్యలపై చర్చించారు.
తన ప్రభుత్వం పరిశ్రమలకు, పారిశ్రామిక వేత్తలకు అనుకూలంగా ఉంటుందని తమ విధానాలు వాటి అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయని అన్నారు.పరిశ్రమలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పిస్తుందని, స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని జిల్లాలోని పరిశ్రమలను ఆదేశించినట్లు తెలిపారు.