Manipur Violence: మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు మరింత చెలరేగుతున్నాయి. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని హింసాత్మక ప్రాంతాల్లో పరిస్థితులు అదుపుతప్పితే.. కాల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మణిపూర్‌లో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియన్ మణిపూర్ (ఎటిఎస్ యుఎం) పిలుపునిచ్చిన గిరిజన సంఘీభావ యాత్ర సందర్భంగా హింస చెలరేగింది.
హింసాత్మక ఘటనలు మరింత చెలరేగే అవకాశం ఉండటంతో.. ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. తీవ్రమైన కేసుల్లో కనిపిస్తే కాల్చివేతకు గవర్నర్ ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ కమిషనర్ టి.రంజిత్ సింగ్ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆందోళనకారులను కట్టడి చేసేందుకు ప్రయత్నించాలని.. ఒకవేళ పరిస్థితిని నియంత్రించలేని పరిస్థితులు ఏర్పడితే కాల్పులకు అవకాశం కల్పిస్తూ గవర్నర్ తరఫున జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
మణిపూర్ ప్రభుత్వం రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మొబైల్ ఇంటర్నెట్‌ను నిలిపివేసింది. హింస తర్వాత తక్షణమే అమలులోకి వచ్చేలా వివిధ జిల్లాల్లో సెక్షన్ 144 కింద కర్ఫ్యూను విధించింది.మంగళవారం మరియు బుధవారం రాత్రులలో సైన్యం మరియు అస్సాం రైఫిల్స్ దళాలను మోహరించారు. గురువారం ఉదయం నాటికి హింస అదుపులోకి వచ్చింది.దాదాపు 4,000 మంది గ్రామస్తులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రాంగణాల్లో ఆశ్రయం కల్పించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆర్మీ సిబ్బంది కూడా ఆ ప్రాంతంలో ఫ్లాగ్ మార్చ్‌లు నిర్వహించారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని మణిపూర్ సీఎంను అమిత్ షా కోరారు. మణిపూర్, కేంద్ర ప్రభుత్వాల మధ్య చర్చలు ముగిసిన తర్వాత మణిపూర్‌లో అదనపు బలగాలను మోహరించాలని నిర్ణయించారు. ఈ బలగాలను సమీప రాష్ట్రాల నుంచి మణిపూర్‌కు రప్పించనున్నారు.ఇదిలా ఉండగా, 24 గంటల నుంచి కొన్ని చోట్ల ఘర్షణలు, విధ్వంసాలు చోటుచేసుకున్నాయని సీఎం ఎన్ బీరెన్ సింగ్ అన్నారు. సమాజంలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న అపోహ కారణంగానే ఈ ఘటనలు జరిగాయన్నారు.