Hathras Stampede Report: ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో తొక్కిసలాటపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిఫారసు మేరకు యూపీ ప్రభుత్వం ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం), తహసీల్దార్, సర్కిల్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ మరియు ఇద్దరు పోలీసు అవుట్‌పోస్టు ఇన్ చార్జిలు ఉన్నారు. వీరు కాకుండా ప్రోగ్రాం ఆర్గనైజర్ మరియు తహసీల్ స్థాయి పోలీసులు, అధికార యంత్రాంగాన్ని కూడా విచారణ కమిటీ దోషులుగా నిర్ధారించింది. సోమవారం తన నివేదికను సమర్పించిన సిట్, సమగ్ర దర్యాప్తు చేయవలసిన అవసరం ఉందని తెలిపింది.
నిబంధలన ఉల్లంఘన..(Hathras Stampede Report)
సస్పెండ్ అయిన అధికారులు భోలే బాబా సత్సంగ్ సమావేశాన్ని సీరియస్‌గా తీసుకోలేదని, తమ సీనియర్లకు సమాచారం ఇవ్వలేదని సిట్ గుర్తించిందని ఒక అధికారి తెలిపారు. వేదికను పరిశీలించకుండా లేదా సీనియర్ అధికారులకు సమాచారం ఇవ్వకుండానే సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ ఈవెంట్‌కు అనుమతిని మంజూరు చేసినట్లు ఆయన చెప్పారు.. వాస్తవాలను దాచిపెట్టి ఈవెంట్‌కు నిర్వాహకులు అనుమతి పొందారని అన్నారు.అనుమతికి వర్తించే షరతులు పాటించలేదని అధికారి తెలిపారు. నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయలేదని మరియు పరిపాలన అనుమతించిన షరతులను పాటించలేకపోయారని ఆయన అన్నారు.ఆర్గనైజింగ్ కమిటీతో సంబంధమున్న వ్యక్తులు గందరగోళాన్ని వ్యాప్తి చేశారని సిట్ పేర్కొన్నట్లు అధికారి తెలిపారు. సరైన పోలీసు వెరిఫికేషన్ లేకుండానే కొందరిని కమిటీలో చేర్చారని అన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందని, కార్యక్రమ వేదికను తనిఖీ చేయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారని అధికారి తెలిపారు. పెద్ద సంఖ్యలో జనం ఉన్నప్పటికీ, బారికేడ్లు ఏర్పాట్లు చేయలేదని ఆయన అన్నారు.
తొక్కిసలాట జరిగిన సమయంలో ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు. అడ్మినిస్ట్రేటివ్ ,పోలీసు అధికారులు, ప్రజలు మరియు ప్రత్యక్ష సాక్షులు సహా 125 మంది వ్యక్తుల వాంగ్మూలాలను సిట్ నమోదు చేసింది. అదనంగా, సంఘటనకు సంబంధించిన వార్తా కథనాలు, ఆన్-సైట్ వీడియోగ్రఫీ, ఫోటోగ్రాఫ్‌లు మరియు వీడియో క్లిప్పింగ్‌లను సమీక్షించారని ఆయన చెప్పారు.