Gyanvapi Dispute: జ్ఞానవాపి వివాదానికి సంబంధించిన మొత్తం ఏడు కేసులను కలిపి విచారిస్తామని వారణాసి జిల్లా కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది. సోమవారం విచారణ ముగియడంతో తీర్పును రిజర్వ్‌లో ఉంచిన జిల్లా న్యాయమూర్తి ఈరోజు తన తీర్పులో సంబంధిత ఏడు కేసులను కలిపి విచారించనున్నట్లు తెలిపారు.
హిందూ పక్షానికి చెందిన పిటిషనర్ల అభ్యర్దన..(Gyanvapi Dispute)
హిందూ పక్షానికి చెందిన నలుగురు పిటిషనర్ల బృందం గత సంవత్సరం వివిధ కోర్టుల ముందు పెండింగ్‌లో ఉన్న జ్ఞాన్‌వాపి వివాదంలో సంబంధిత కేసులన్నింటినీ కలుపుతూ, సమయం మరియు డబ్బు ఆదా చేయడం మరియు చట్టపరమైన ఇబ్బందులను నివారించడం కోసం ఒక అభ్యర్థనను దాఖలు చేసింది.ఆగస్టు 2021లో, జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ఉన్న శృంగార్ గౌరీ స్థలంలో నిత్య పూజలు చేసే హక్కును కోరుతూ ఐదుగురు మహిళలు స్థానిక కోర్టులో పిటిషన్ వేశారు. ఏప్రిల్ 2022లో, సీనియర్ డివిజన్ కోర్టు మసీదు ప్రాంగణాన్ని సర్వే చేయాలని ఆదేశించింది. మే 2022లో సర్వే పూర్తయింది. ఈ సమయంలో, మసీదు సముదాయంలో ఒక శివలింగం కనుగొనబడింది, ఇది ఫౌంటెన్ అని ముస్లిం పక్షం పేర్కొంది.
కార్బన్ డేటింగ్ నిలిపివేయాలి..
ఈ అంశంపై తదుపరి విచారణ జరిగే వరకు జ్ఞాన్‌వాపి మసీదు-కాశీ విశ్వనాథ్ కారిడార్‌లోని శివలింగానికి కార్బన్ డేటింగ్ నిర్వహించరాదని మే 19న సుప్రీంకోర్టు భారత పురావస్తు శాఖ (ఏఎస్‌ఐ)కి తెలిపింది.మే 16న హిందూ తరపు న్యాయవాది విష్ణు శంకర్ జైన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై మే 19లోగా సమాధానం ఇవ్వాలని జ్ఞాన్‌వాపి మసీదు కమిటీని కోర్టు ఆదేశించింది.ఈ అంశంపై తదుపరి విచారణ ఆగస్టు 7న జరగనుంది.