Chandipura Virus Deaths: గుజరాత్ లో చండీపురా వైరస్‌తో ఆరుగురు చిన్నారులు మరణించారని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రుషికేష్ పటేల్ తెలిపారు. రాష్ట్రంలో ఈ వైరస్ కు సంబంధించి మొత్తం 12 కేసులు నమోదయ్యాయన్నారు. వీరిలో నలుగురు సబర్ కాంత జిల్లాకు, ముగ్గురు అరావళి, మహిసాగర్, ఖేడా జిల్లాలనుంచి ఒక్కొక్కరు, రాజస్థాన్ నుంచి ఇద్దరు, మధ్యప్రదేశ్ నుంచి ఒకరు ఉన్నారని తెలిపారు. అయితే ఈ మరణాలు చండీపురా వైరస్ తో సంభవించాయా లేదా అన్నది ధృవీకరించవలసి ఉందని ఆయన చెప్పారు. మొత్తం 12 నమూనాలను ధృవీకరణ కోసం పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి)కి పంపారని ఆయన తెలిపారు.
చండీపురా వైరస్ (CHPV) ను మహారాష్ట్రలోని చండీపురా జిల్లాలో 1965లో మొదటిసారిగా గుర్తించారు. ఈ పిల్లల్లో మెదడు వాపు వ్యాధికి కారణమవుతుంది. చండీపురా వైరస్ ప్రధానంగా దోమలు, పేలు మరియు ఇసుక ఈగలు వంటి వాహకాల ద్వారా మనుషులకు ఇన్‌ఫెక్షన్ వ్యాపిస్తుంది. దీని ప్రభావంతో అధిక జ్వరం, తలనొప్పి, వాంతులతో రోగులు కోమాలోకి వెళ్లవచ్చు. ఇది ఎక్కువగా పిల్లల్లో వ్యాపిస్తుంది. వైరస్ సోకినట్లు ముందుగానే గుర్తించి చికిత్స చేసినట్లయితే ప్రాణాలను కాపాడవచ్చు.