Gita Press: అయోధ్యలో శ్రీరాముని విగ్రహం ప్రాణ ప్రతిష్ఠకు తేదీని ప్రకటించిన తర్వాత రామచరిత మానస్ కాపీల కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. దీనితో గోరఖ్ పూర్ కు చెందిన గీతా ప్రెస్ గోస్వామి తులసీదాస్ రచించిన ఈ గ్రంధాన్ని తమ వెబ్‌సైట్‌లో ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకుంది. గీతా ప్రెస్ పబ్లిషింగ్ హౌస్ మేనేజర్ లాల్మణి త్రిపాఠి ఈ విషయాన్ని చెప్పారు.
మేము ప్రస్తుతం గీతా ప్రెస్ వెబ్‌సైట్‌లో రామచరితమానస్‌ని అప్‌లోడ్ చేసే పనిలో ఉన్నాము. ఇది ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. ఈ సేవ 15 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది, దీని ద్వారా 50,000 మంది వ్యక్తులు ఏకకాలంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిమాండ్ పెరిగితే, మేము ఒకేసారి 100,000 మంది డౌన్‌లోడ్ చేసుకునే విధంగా సామర్థ్యాన్ని పెంచుతామని త్రిపాఠి తెలిపారు. ప్రజలు అయోధ్య వేడుక పట్ల చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపధ్యంలో రామచరితమానస్, సుందర్‌కాండ్ మరియు హనుమాన్ చాలీసా కాపీలను పారాయణం కోసం పెద్ద ఎత్తున పంపిణీ చేయాలని కూడా ఆలోచిస్తున్నారని ఆయన చెప్పారు. అయోధ్యలోని రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట వేడుకను ప్రకటించిన తర్వాత రామచరిత మానస్ కు డిమాండ్ గణనీయంగా పెరిగింది. లక్ష కాపీలను అందించడానికి ప్రయత్నించినప్పటికీ, పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం తమకు సవాలుగా మారిందన్నారు. చాలా చోట్ల స్టాక్ అందుబాటులో లేదని చెప్పవలసి వచ్చింది. ఇటీవల, జైపూర్ నుండి మాకు 50,000 కాపీల కోసం, భాగల్పూర్ నుండి 10,000 కాపీలకు ఆర్డర్ వచ్చింది. కానీ మేము తిరస్కరించవలసి వచ్చింది. దేశం మొత్తం ఇదే పరిస్థితి అని త్రిపాఠి పేర్కొన్నారు.
గీతా ప్రెస్ శ్రీ రామంక్ అనే పుస్తకాన్ని ప్రచురించింది మరియు వారు దానిని అయోధ్యకు పంపనున్నారు. రామమందిరం ప్రారంభోత్సవ వేడుకలకు హాజరయ్యేందుకు వచ్చే ముఖ్య అతిథులకు ఈ పుస్తకాన్ని బహుమతిగా ఇవ్వనున్నారు. అంతే కాకుండా, వారు అయోధ్య మరియు రాముడి చరిత్రతో సహా రామ మందిరానికి సంబంధించిన మొత్తం సమాచారాన్ని చేర్చే పుస్తకాన్ని కూడా ప్రచురించారు. ఆ పుస్తకం పేరు అయోధ్య మహాత్మ. ఈ పుస్తకంలో శ్రీరాముని వంశం, అయోధ్య అభివృద్ధి, రాముడి బాల్యం గురించిన కథలు, రాజు అయిన తర్వాత అతని ప్రయాణం మరియు సంవత్సరాలుగా అయోధ్య ఎదుగుదల గురించి కూడా అధ్యాయాలు ఉంటాయి.
1923లో స్థాపించబడిన గీతా ప్రెస్ 15 భాషల్లో 95 కోట్ల పుస్తకాలను రూపొందించి ప్రపంచంలోని అతిపెద్ద ప్రచురణకర్తలలో ఒకటిగా నిలిచింది. ఈ సంస్దకు గత సంవత్సరం గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేశారు. గీతా ప్రెస్ కు దేశవ్యాప్తంగా అమ్మకం కేంద్రాలు ఉన్నాయి.రామమందిర ఉద్యమంలో గీతా ప్రెస్ ముఖ్యమైన పాత్ర పోషించింది.