Gautam Gambhir: యమునా నది ఉద్ధృతితో ఢిల్లీ నీటమునిగింది. కాగా ఆప్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఢిల్లీకి ఈ పరిస్థితి వచ్చిందంటూ బీజేపీ ఎంపీ, మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో ఢిల్లీ ప్రజలు మేల్కొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ మేరకు మాజీ క్రికెటర్ గౌతమ్ ట్వీట్ చేశారు. ఢిల్లీ నగరం కాస్త ఇప్పుడు మురికి కాలువలా మారిందని, ప్రజలు ఇప్పటికైనా తమకు ఏదీ ఉచితంగా రాదని గుర్తించాలని, అభివృద్ధిని పక్కన పెట్టి అన్నీ ఉచితమని వెళ్తే ఇలాంటి పరిస్థితులే ఎదురవుతాయని ఆయన చెప్పుకొచ్చారు.
‘ఢిల్లీవాసులారా మేల్కోండి. ఢిల్లీ అధ్వానంగా తయారయింది. ఏదీ ఉచితం కాదు. అలా ఉచితం అనుకుంటే ఇలా మూల్యం చెల్లించాల్సి వస్తుంది’ అని ఈస్ట్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ద్వారా ఆమ్ ఆద్మీ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు.
కేజ్రీవాల్ ప్రభుత్వంపై బీజేపీ ఆరోపణలు(Gautam Gambhir)
ఢిల్లీలోని ప్రస్తుత పరిస్థితికి కేజ్రీవాల్ ప్రభుత్వమే కారణమని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను, నిర్వహణ, సన్నాహక లోపాలను ఎత్తిచూపుతూ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. యమునానది నీటి మట్టం ఎన్నడూ లేనంతగా పెరిగిందని, ప్రజల ప్రాణాలను రక్షించడమే తమ తక్షణ కర్తవ్యమని ప్రభుత్వం చెబుతోంది. వరదల ధాటికి ముఖ్యమంత్రి నివాసం, ఢిల్లీ అసెంబ్లీ సమీపంలోని వీఐపీ జోన్, ఎర్రకోట ప్రాంగణం సహా పలు ప్రాంతాలు నీట మునిగాయి.
గత రెండు రోజులుగా ఉత్తరాదిన భారీ వర్షాలు కురవడంతో అన్ని బ్యారేజీల్లో నీటి ఉద్ధృతి పెరగడంతో వాటిని దిగువ ప్రాంతాలకు వదులుతున్నారు. ఇలా హర్యానా డ్యాం నుంచి నీటిని విడుదల చేయడం వల్ల ఢిల్లీకి ఈ పరిస్థితి ఏర్పడిందని ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని వరదనీటి విడుదలను తగ్గించాలని కేజ్రీవాల్ కోరారు.
Wake up Delhiites
Delhi has become a gutter
Nothing is for free, this is the PRICE!!— Gautam Gambhir (@GautamGambhir) July 13, 2023