Former Kerala BJP president K.Surendran accuses YouTuber Jyoti Malhotra : పాక్ నిఘా సంస్థలకు భారత్‌కు చెందిన సమాచారాన్ని చేరవేస్తున్నారన్న ఆరోపణలపై యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. జ్యోతి కేరళ పర్యటనపై ఆ రాష్ట్ర బీజేపీ మాజీ అధ్యక్షుడు కె.సురేంద్రన్ సంచలన ఆరోపణలు చేశారు. కేరళ పర్యాటక శాఖ మంత్రి పీఏ.మహమ్మద్ రియాస్ నేతృత్వంలో జ్యోతి పర్యటనకు టూరిజం శాఖ స్పాన్సర్ చేసిందని పేర్కొన్నారు. రియాస్ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ అల్లుడు.
సీఎం పినరయి అల్లుడు రియాస్ నేతృత్వంలోని ఆ రాష్ర్ట పర్యాటక శాఖ పాకిస్థాన్ గూఢచారి జ్యోతి కన్నూర్ టూర్‌కు స్పాన్సర్ చేసింది. ఆమె ఎవరిని కలిసింది? ఎక్కడికి వెళ్లింది? అసలు అజెండా ఏంటి? పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్న వ్యక్తికి కేరళలో రెడ్ కార్పెట్ ఎందుకు వేశారు?’ అని సురేంద్రన్ ‘ఎక్స్’లో ప్రశ్నించారు.
ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ జ్యోతి ట్రావెల్ విత్ జో పేరుతో యూట్యూబ్ ఛానల్ నడుపుతోంది. 2023లో పాకిస్థాన్‌కు వెళ్లిన సమయంలో ఆమెకు పాక్ హైకమిషన్ ఉద్యోగి డానిష్‌తో పరిచయం ఏర్పడింది. అనంతరం ఆమె పాక్ గూఢచర్య సంస్థ ప్రతినిధులతో టచ్‌లోకి వెళ్లినట్లు తెలిసింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జ్యోతి డానిష్‌తో మాట్లాడినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు జ్యోతిని ప్రశ్నించారు. విచారణలో ఆమెకు ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు ఇప్పటివరకు ఆధారాలు లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. ఆమె పూర్తి స్పృహతోనే పాక్ ఇంటెలిజెన్స్ అధికారులతో సంప్రదింపులు కొనసాగించిందన్నారు.
పాక్ సొంత ఇల్లులా ఉంది..
పాకిస్థాన్ నిఘా సంస్థ ఏజెంట్లకు ఇండియా మొబైల్ సిమ్‌కార్డులు సరఫరా చేస్తున్న ఆరోపణలతో కాసిమ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా పాకిస్థాన్‌లోని ఓ వార్తా సంస్థకు అతడు ఇచ్చిన ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో బయటకు వచ్చింది. దీంతో కాసిమ్ పాకిస్థాన్‌లో పర్యటించాడనే విషయాన్ని అధికారులు ధ్రువీకరించారు. వీడియోలో ‘మరోసారి పాకిస్థాన్‌కు స్వాగతం. ఇక్కడకు తిరిగి రావడం ఎలా అనిపిస్తుంది?’ అని కాసిమ్‌ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి అతడు స్పందించారు. ఇది తనకు సొంత ఇంటిలా అనిపిస్తుందన్నాడు. ఇక్కడ తనకు చాలా ప్రేమ, ఆప్యాయత లభిస్తోందని వెల్లడించాడు. ఇదే తనను మళ్లీ ఇక్కడికి వచ్చేలా చేసిందన్నాడు. పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలతో కాసిమ్ సోదరుడు హసిన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.