Sikkim Floods: సిక్కింలో ఆకస్మిక వరదలు.. 23 మంది ఆర్మీ జవాన్ల గల్లంతు

మంగళవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు రావడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు వద్ద కుంభవృష్ణి కారణంగా ఈ వరద ఏర్పడింది

  • Written By:
  • Publish Date - October 4, 2023 / 01:09 PM IST

Sikkim Floods: మంగళవారం రాత్రి సిక్కింలోని లాచెన్ లోయలో తీస్తా నదిలో ఒక్కసారిగా వరదలు రావడంతో 23 మంది ఆర్మీ సిబ్బంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు.ఉత్తర సిక్కింలోని లొనాక్ సరస్సు వద్ద కుంభవృష్ణి కారణంగా ఈ వరద ఏర్పడింది. దీని కారణంగా తీస్తాలో నీటి మట్టాలు అకస్మాత్తుగా పెరిగాయి. చుంగ్తాంగ్ డ్యామ్ నుండి నీటిని విడుదల చేయడం వల్ల పరిస్థితి మరింత తీవ్రమైంది.దీనివల్ల దిగువకు 15-20 అడుగుల ఎత్తు వరకు నీటి మట్టం పెరిగింది.

నీటమునిగిన ఆర్మీ శిబిరాలు.. (Sikkim Floods)

ఆకస్మిక వరదతో లాచెన్ లోయ వెంబడి ఉన్న పలు ఆర్మీ శిబిరాలు నీటమునిగాయి. పూర్తి స్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.నది పొంగి ప్రవహించడంతో తీస్తా నదిపై ఉన్న సింథమ్ ఫుట్ బ్రిడ్జి కూలిపోయింది. పశ్చిమ బెంగాల్‌ను సిక్కింను కలిపే జాతీయ రహదారి 10 పలు చోట్ల దెబ్బతింది. ఆకస్మిక వరద నేపధ్యంలో నామ్చిలో చాలా రోడ్లు ధ్వంసం అయ్యాయి. తూంగ్ వంతెన కూలిపోవడంతో మంగన్ జిల్లాలోని చుంగ్తాంగ్ తెగిపోయింది. ఫిడాంగ్ మరియు డిక్చులో పలు ఇళ్లు కొట్టుకుపోగా ఆరుగురు వ్యక్తులు తప్పిపోయారు. గ్యాంగ్‌టక్‌లో, వర్షం సంబంధిత సంఘటనల కారణంగా నలుగురు వ్యక్తులు గాయపడగా వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నామ్చి జిల్లాలో 500 మందికి పైగా ప్రజలను తరలించి సహాయక శిబిరాలకు తరలించారు. సిక్కిం ప్రభుత్వం రాష్ట్రంలో హై అలర్ట్ ప్రకటించి తీస్తా నదికి దూరంగా ఉండాలని ప్రజలను కోరింది. పశ్చిమ బెంగాల్‌లోని జల్పాయ్ గురి పరిపాలన ముందుజాగ్రత్త చర్యగా నది దిగువ పరివాహక ప్రాంతం నుండి ప్రజలను తరలించడం ప్రారంభించింది. రానున్న రెండు రోజుల పాటు గ్యాంగ్‌టక్, గ్యాల్‌షింగ్, పాక్యోంగ్ మరియు సోరెంగ్ జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మంగన్ మరియు నామ్చి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ ప్రకటించారు.

చిక్కుకుపోయిన పర్యాటకులు..

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతాల ప్రజలను గరిష్టంగా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాలింపాంగ్, డార్జిలింగ్ మరియు జల్పాయిగురి జిల్లాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి అన్ని చర్యలు తీసుకున్నట్లు” హామీ ఇచ్చారు.ఈ ఏడాది జూన్‌లో ఉత్తర సిక్కిం జిల్లా భారీ రుతుపవన వర్షాల కారణంగా భారీ వరదలను ఎదుర్కొంది. పెగాంగ్ ప్రాంతంలో వరదలతో NH10ని పూర్తిగా మూసివేసారు. హైవే వెంబడి ఉన్న మౌలిక సదుపాయాలకు భారీ నష్టం వాటిల్లింది. తీవ్ర వర్షపాతం కారణంగా సమీపంలోని నదులు పొంగిపొర్లడం వల్ల లాచెన్ మరియు లాచుంగ్ వంటి ప్రాంతాలు రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాల నుండి తెగిపోయాయి. ఆకస్మిక వరదల కారణంగా దాదాపు 2,400 మంది పర్యాటకులు ఈ ప్రాంతంలో చిక్కుకుపోయారు. సహాయక చర్యల కోసం సైన్యాన్ని రప్పించారు.