Chennai Temple:చెన్నైలోని మూవరసంపేట్ ఆలయ చెరువులో బుధవారం పూజల సమయంలో మునిగి 18 మరియు 23 సంవత్సరాల మధ్య వయస్సు గల ఐదుగురు వ్యక్తులు మరణించారు.
నంగనల్లూరులోని ధర్మలింగేశ్వరార్ ఆలయంలో గత కొన్ని రోజులుగా వేడుకలు నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా బుధవారం అర్చకులు ఆలయం నుంచి అమ్మవారిని చెరువు వద్దకు తీసుకొచ్చారు. పూజలు చేసేందుకు 30 మందికి పైగా చెరువులోకి దిగారు.
వీరిలో కొందరు మాత్రమే ధర్మలింగేశ్వరార్ ఆలయానికి సంబంధించిన పూజారులు కాగా, మిగిలిన వారు ఆలయ ఆచార వ్యవహారాల్లో స్వచ్ఛందంగా సహకరిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఒక భక్తుడు తీసిన వీడియోలో కొంతమంది పూజారులు దేవతను పట్టుకొని ఉండగా మిగిలిన వారు వారి చుట్టూ నిలబడి ఉన్నారు.వాలంటీర్లలో ఒకరు చెరువు లోతైన భాగంలో చిక్కుకుపోయారని, మిగిలిన వారు అతన్ని రక్షించడానికి ప్రయత్నించినప్పుడు, వారందరూ మునిగిపోయారు. స్థానిక పోలీసులు అప్రమత్తమై ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను క్రోమ్‌పేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్, ఇతర అధికారులు కూడా సంఘటనా స్థలాన్ని సందర్శించారు.
తమిళనాడు కేబినెట్ మంత్రి అన్బరసన్, చెంగల్పట్టు జిల్లా కలెక్టర్ ఏఆర్ రాహుల్ నాధ్ మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉంచిన ఆస్పత్రికి చేరుకున్నారు.మృతులను నంగనల్లూరుకు చెందిన రాఘవన్ (22), సూర్య (23), వనేష్ (18), కీల్‌కట్టలైకి చెందిన యోగేశ్వరన్ (22), పజవంతంగల్‌కు చెందిన రాఘవ్ (18)గా గుర్తించారు ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ “అందరూ యువకులే. ఈ దురదృష్టకర సంఘటనతో నేను చాలా బాధపడ్డాను. సరైన భద్రతా చర్యలతో పండుగను నిర్వహించాలి. భద్రతా చర్యలు తీసుకోకపోవడంతో ఇది జరిగింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. బాధిత కుటుంబాలను ముఖ్యమంత్రి ఆదుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆలయం ప్రైవేట్‌గా ఉందని, హిందూ మత మరియు ధర్మాదాయ శాఖ (హెచ్‌ఆర్ అండ్ సిఇ)కి అనుబంధంగా లేదని ఆయన పేర్కొన్నారు. చెరువును మూసివేశామని, ఘటనపై తదుపరి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు..