Haryana Farmers: పొద్దుతిరుగుడు విత్తనాలకు కనీస మద్దతు ధర మరియు రైతు నాయకుడు గుర్నామ్ సింగ్ చారుని విడుదల చేయాలని కోరుతూ హర్యానా రైతులు ఢిల్లీ-హర్యానా జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ను అడ్డుకున్నారు. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం పొద్దుతిరుగుడు విత్తనాలను ఎంఎస్‌పికి కొనుగోలు చేయడం లేదని, క్వింటాల్‌కు ఎంఎస్‌పి రూ. 6,400 ఉండగా, తమ ఉత్పత్తులను క్వింటాల్‌కు రూ. 4,000 చొప్పున ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించాల్సి వస్తోందని రైతులు పేర్కొన్నారు.
రైతుల ఆందోళనకు బజరంగ్ పునియా మద్దతు..(Haryana Farmers)
రెజ్లర్ బజరంగ్ పునియా రైతులతో కలసి ఆందోళనలో పాల్గొన్నారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు రైతులు మద్దతు ఇచ్చినందుకు రైతుల నిరసనలో చేరాలని పునియా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. తమ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోవాలని రైతులు రోడ్లను దిగ్బంధించడం ఇదే మొదటిసారి కాదు. గత వారం రైతులు ఢిల్లీ-చండీగఢ్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. భారతీయ కిసాన్ యూనియన్ (చారుణి) చీఫ్ గుర్నామ్ సింగ్ చారుణి రైతులను రోడ్లను దిగ్బంధించాలని పిలుపునిచ్చారు, ఈ నేపధ్యంలో పోలీసులు నిరసనకారులను చెదరగొట్టడానికి లాఠీచార్జ్ చేసి వాటర్ ఫిరంగులను ఉపయోగించారు. అల్లర్లు మరియు చట్టవిరుద్ధమైన సమావేశాలతో సహా పలు ఆరోపణలపై చారుణితో పాటు మరో తొమ్మిది మందిని అరెస్టు చేశారు.
ఇలా ఉండగా తాము హైవేలను దిగ్బందించడం లేదని రైతు సంఘం నేత తికాయత్ అన్నారు. మాకు రెండు డిమాండ్లు మాత్రమే ఉన్నాయి, నిర్బంధించబడిన రైతులను విడుదల చేయండి. కనీస మద్దతు ధర ప్రకారం పొద్దుతిరుగుడు విత్తనాలను కొనుగోలు చేయడం ప్రారంభించండి. మేము ప్రభుత్వంతో చర్చలకు సిద్దంగా ఉన్నామని అన్నారు.